‘తిత్లీ’ తుపాను ప్రభావం ఉత్తరాంధ్ర, ఒడిశా ప్రాంతంలో ‘రెడ్ అలర్ట్’
బంగాళాఖాతంలో నాలుగు రోజులుగా తిష్టవేసిన ఈ ‘తిత్లీ’ తుపాను ఒడిశా తీరం వైపు అతివేగంగా దూసుకొస్తోంది. బుధవారం సాయంత్రానికి విశాఖపట్నానికి కేవలం 270 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీని ప్రభావం, నష్టం భారీగా ఉంటుందని, శ్రీకాకుళం, ఒడిశా ప్రాంతాలను వణికించనుందని వాతావరణ పరిశోధకులు చెబుతున్నారు. గురువారం ఉదయం 4 గంటల నుంచి 6 గంటల మధ్య శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం, సంతబొమ్మాళి మధ్య తీరం దాటి మందస, వజ్రపుకొత్తూరు, సంతబొమ్మాళిలో కుండపోత వర్షాలు పడనున్నాయి. ఈ ప్రభావంతో బుధవారం రాత్రి, గురువారం ఉదయం విశాఖతో పాటు విజయనగరంలో ఈదురుగాలులు గంటకు 80-90 కిలోమీటర్ల వేగంతో వీస్తూ వర్షాలు పడే అవకాశాలున్నాయి.
గురువారం నాటికి ఈ వేగం పెరగనుందని భావిస్తున్నారు. కళింగపట్నానికి ఆగేయంగా 190 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం తుపాను కేంద్రీకృతమై ఉందని, గురువారం ఉదయం 4 గంటల నుంచి తీవ్రమై ఉత్తరాంధ్రలో విశాఖలో పెద్దఎత్తున గాలులు వీస్తూ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు బుధవారం రాత్రి వెల్లడించారు.
24 గంటల పర్యవేక్షణ
తిత్లి తుఫాను నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదు ర్కొనేందుకు 24 గంటల పర్యవేక్షణ చేస్తూ అధికారులు సిద్ధంగా ఉండాలని, ముందుగానే ప్రజలను అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉత్తరాంధ్ర జిల్లాల అధికారులను ఆదేశించారు. 1100 నుండి తుఫాను ప్రభా విత ప్రాంతాల ప్రజలను అరగంటకోసారి సమాచారం పంపాలని, దీనిద్వారా వారందరూ సురక్షిత ప్రాంతాల్లోకి చేరేలా చూడాలని ఆదేశించారు. మరోవైపు కేంద్ర మంత్రి డాక్టర్ హర్ష్‌వర్థన్ ఉత్తరాంధ్ర, ఒడిశా అధికారులతో హుటాహుటిన బుధవారం సాయంత్రం సమీక్ష నిర్వహిం చారు. పరిపాలనా యంత్రాంగం సహాయక చర్యల్లో నిమగం కావాలని ఆదేశించారు.