దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. భక్తులు భక్తి శ్రద్దలతో శ్రీరాములవారి కళ్యాణాన్ని చూసేందుకు ఆలయాల వద్ద క్యూలు కట్టారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ వేడుకలు ఎంత ఘనంగా నిర్వహిస్తారో చెప్పనవసరం లేదు.
దక్షిణ అయోధ్యగా పిలుచుకునే భద్రాచల క్షేత్రం లో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవానికి ఇంతకు ముందే సర్వం సిద్ధం చేశారు. ఎప్పటిలాగే ఈ సంవత్సరం చైత్రశుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రంలో అభిజిత్ లగ్న సుముహూర్తంలో పాంచరాత్ర ఆగమం ప్రకారం శ్రీసీతారామచంద్రుల తిరు కల్యాణోత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు.
మిథిలా స్టేడియంలో సీతారాముల కళ్యాణోత్సవం అట్టహాసంగా జరుగుతుంది. ఇక్కడ తానీషా కాలం నుంచి సీతారాముల కళ్యాణానికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించడం ఆనవాయితీ. ఈ కళ్యాణానికి తెలంగాణ ప్రభుత్వం నుండి మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందించారు. ఇక, టీటీడీ నుండి స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సమర్పించారు.