ఆసియా మార్కెట్ల సానుకూల ప్రభావంతో శుక్రవారం (అక్టోబర్ 27) ఉదయం స్టాక్ మార్కెట్లు ఆశాజనకంగా ప్రారంభమయ్యాయి. నిన్నటి ఊపును కొనసాగిస్తూ సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా లాభపడి సరికొత్త రికార్డుల్లో ట్రేడింగ్ ఆరంభించింది. అయితే చివరి గంటల్లో మదుపర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో లాభనష్టాల్లో ఊగిసలాడింది. చివరకు సూచీ స్వల్పంగా 10.09 పాయింట్లు లాభపడి 33,157.22 వద్ద సరికొత్త రికార్డులో ముగిసింది. అటు నిఫ్టీ మాత్రం నిన్నటి రికార్డుల నుంచి కిందకు పడిపోయింది. నేటి ట్రేడింగ్‌లో 23.50 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ.. 10,320.30 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 64.99గా కొనసాగుతోంది.
మొత్తంమీద వారాంతంలో దేశీయ సూచీలు స్తబ్దుగా ముగిశాయి. ఆరంభ ట్రేడింగ్‌లో కొత్త రికార్డుల దిశగా దూసుకెళ్లినా.. చివరి గంటలో అమ్మకాలు వెల్లువెత్తడంతో చతికిలపడ్డాయి. దీనికి తోడు బ్యాంకింగ్ రంగాల షేర్లు కూడా తడబడ్డాయి. దీంతో సెన్సెక్స్ స్వల్ప లాభంతో కొత్త రికార్డుకు ఎగబాకినప్పటికీ.. నిఫ్టీకి మాత్రం నష్టాలు తప్పలేదు.