బాబు జగ్జీవన్ రామ్ కు జాతీయ బీసీ దళ్ అధినేత దుండ్ర కుమారస్వామి ఘన నివాళి
బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. బడుగు, బలహీన వర్గాల ఆరాధ్య దైవం జగ్జీవన్ రాం అని కొనియాడారు. పీడిత దళిత దీన జనుల కోసం శ్రమించి, సంస్కరణల కోసం పాటుపడిన యోధుడు జగ్జీవన్ రామ్. ఆయన జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని దుండ్ర కుమారస్వామి పిలుపునిచ్చారు. ఈ దేశం ఎప్పటికీ గుర్తుంచుకోగల నాయకుడు, సామాజిక, రాజకీయ బానిసత్వాలపై జీవితాంతం యుద్ధం చేసిన బాబూజీ ఇప్పటికీ స్ఫూర్తి దాత అని దుండ్ర కుమారస్వామి అన్నారు.
భారతదేశంలో వలసవాదానికి, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న స్వాతంత్రోద్యమ పోరాటంతో పాటు కుల నిర్మూలన, సామాజిక సంస్కరణ ఉద్యమాల్లో కీలకంగా పని చేసిన శిఖరం బాబు జగ్జీవన్ రామ్. బాబుజీగా ప్రసిద్ది చెందిన జగ్జీవన్ రామ్ అంటరానివారి శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. 1936-1986 మధ్య 50 సంవత్సరాల పాటు నిరంతరాయంగా పార్లమెంటు సభ్యుడిగా ఉండి ప్రపంచ రికార్డు సాధించారు. దళిత హక్కుల కోసమే కాదు, మానవతా కార్యక్రమాల్లోనూ ఆయన చురుకుగా పాల్గొనే వారు. తాను పాల్గొనడమే కాక అందరినీ చైతన్యపరిచే వారు. బాబు జగ్జీవన్ రామ్ అణగారిన వర్గాల హక్కుల కోసం, పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, దళితుల కోసం, బీసీల కోసం అవిశ్రాంతంగా పోరాడిన రాజకీయ-సామాజిక యోధుడు, ఆయన సేవలు వెలకట్టలేనివి, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన నిత్యం కృషి చేశారని దుండ్ర కుమారస్వామి కొనియాడారు.
ఈ కార్యక్రమంలో పద్మశాలి, బీసీ సంఘం అధ్యక్షుడు ఐలయ్య, సంఘం అధ్యక్షుడు జనార్ధన్, రమణా రాజు మల్లేష్ రమణ రాజు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.