ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్(76) కన్నుమూత
బుధవారం ఉదయం ఆయన కేంబ్రిడ్జ్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు స్టీఫెన్ కుటుంబ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఖమా నాన్న ఈ రోజు మమ్మల్ని విడిచి వెళ్లిపోయారు. ఇది అత్యంత బాధాకరం’ అని స్టీఫెన్ పిల్లలు లూసీ, రాబర్ట్, టిమ్ ఓ ప్రకటనలో తెలిపారు. వీల్‌చెయిర్‌కే పరిమితమైనా.. తనలోని విశ్వాన్వేషణ తపనను మాత్రం ఆయన ఎప్పుడూ కోల్పోలేదు. ఒకరకంగా ఆయనను ఇన్నాళ్లూ నడిపించిన శక్తి కూడా అదే కావచ్చు. మనిషి ఈ అనంత విశ్వాన్ని చూస్తున్న తీరునే హాకింగ్ మార్చేశారు. బహుశా హాకింగ్‌లాంటి వ్యక్తిని మళ్లీ చూడటం కూడా అసాధ్యమేనేమో
స్టీఫెన్ పూర్తి పేరు స్టీఫెన్ విలియమ్ హాకింగ్. 1942 జనవరి 8న ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌షైర్ కౌంటీలో జన్మించారు. కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ నుంచి విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన స్టీఫెన్.. భౌతికశాస్త్రంలో అనేక పరిశోధనలు చేశారు. సాపేక్ష సిద్ధాంతం, గురుత్వాకర్షణ ఏకతత్వ సిద్ధాంతాలపై అధ్యయనాలు చేశారు. కృష్ణబిలాలు కూడా రేడియేషన్‌కు ఉత్పత్తి చేస్తాయని ధ్రువీకరించారు. దీన్నే హాకింగ్ రేడియేషన్ అని కూడా పిలుస్తారు.
ఖగోళ శాస్త్రంలో ఆయన చేపట్టిన పరిశోధనలు పెను విప్లవం సృష్టించాయి. ఆయన రచించిన ఖబ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్’ బ్రిటిష్ సండే టైమ్స్‌లో 237 వారాలపాటు బెస్ట్ సెల్లర్‌గా నిలిచి రికార్డు సృష్టించింది. ఆయన రచించిన ఓ పుస్తకం కాలం కథ పేరుతో తెలుగులో కూడా వెలువడింది.
ఆయన జీవితం ఎంత ప్రత్యేకమో.. హాకింగ్ జననం, మరణం కూడా అంతే ప్రత్యేకం. హాకింగ్ పుట్టింది 1942, జనవరి 8. అంటే టెలిస్కోపును కనిపెట్టిన గెలీలియో మరణించిన సరిగ్గా 300 ఏళ్ల తర్వాత అదే రోజు హాకింగ్ జన్మించారు. ఇదే ఓ విశేషం అయితే.. ఆయన మరణం కూడా అలాంటిదే. హాకింగ్ చనిపోయింది మార్చి 14న. సరిగ్గా 140 ఏళ్ల కిందట అంటే 1879లో మార్చి 14న మరో ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ జన్మించారు. అంటే ప్రపంచ గతిని మార్చిన ఇద్దరు గొప్ప శాస్త్రవేత్తల జనన, మరణ తేదీలతో హాకింగ్ తన జనన, మరణాలను పంచుకోవడం నిజంగా విశేషమే.