రాష్ట్రంలో కొవిడ్ వ్యాక్సిన్లు, మందుల సేకరణ, సరఫరాను సమన్వయం చేయడానికి ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి టాస్క్‌ఫోర్స్ తొలి సమావేశం మంత్ర శ్రీ కేటీఆర్ అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్, వికాస్ రాజ్, పంచాయతీరాజ్ సెక్రటరీ సందీప్ సుల్తానియా, సీఎం స్పెషల్ సెక్రటరీ రాజేశేఖర్ రెడ్డి, లైఫ్‌సైన్సెస్ అండ్ ఫార్మా డైరెక్టర్ శక్తి నాగప్పన్ భేటీలో పాల్గొన్నారు.
అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ…
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం రాష్ట్రంలో బెడ్స్‌ను భారీగా పెంచినట్లు తెలిపారు. ఈ పెరిగిన పడకలు రాష్ట్రవ్యాప్త ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్నాయన్నారు. అదేవిధంగా రెమిడెసివిర్ లాంటి మందుల నిల్వలు కూడా ఉన్నట్లు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 1.5 లక్షల ఇంజెక్షన్లు ఉన్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో ఇంజెక్షన్లు తయారుచేస్తున్న కంపెనీల నుంచి అదనపు సరఫరాకు సమన్వయం చేస్తున్నట్లు తెలిపారు. వీటితో పాటు రోగులు సీరియస్‌గా అరుదుగా, అత్యవసరంగా వాడుతున్న టోలిసిజుమాబ్ వంటి మరిన్ని మందుల సరఫరాకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. బ్లాక్ ఫంగస్ అంశంలో కూడా ప్రభుత్వం అప్రమత్తంగా ఉందన్నారు. దీనికి అవసరమైన మందులను ప్రభుత్వం సేకరిస్తుందన్నారు
ఇప్పటికే ప్రభుత్వం ఇస్తున్న హోం ఇసోలేషన్ మందుల నిల్వలో ఎలాంటి కొరత లేదన్నారు. ఇప్పటిదాకా పెద్ద ఎత్తున ఇంటింటికి సర్వే చేస్తూ అవసరం అయిన వారికి మెడికల్ కిట్స్ ఇస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో 60 లక్షల ఇళ్లలో సర్వే పూర్తి అయిందన్నారు. ఇప్పటి దాకా 2.1 లక్షల కిట్స్ అందజేసినట్లు వెల్లడించారు. ఇది ఇన్ పేషేంట్ విజిట్స్‌కు అదనమన్నారు. ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం వల్ల వేలాది మందిని కరోనా మహమ్మారి నుండి కాపాడగలుగుతున్నట్లు చెప్పారు.
కొవిడ్ కోసం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఒకే నంబర్ ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు మంత్రి తెలిపారు. ఆక్సిజన్ సరఫరాపై చర్చించామన్నారు. డిమాండ్- సప్లై పైన వివరాలు తీసుకున్నట్లు చెప్పారు. ఆక్సిజన్ ఆడిట్ ప్రభుత్వం చేస్తుందన్నారు. జిల్లాలో కొవిడ్ నియంత్రణ చర్యల పర్యవేక్షణ కోసం మంత్రులు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. మంత్రులు చేస్తున్న పర్యవేక్షణ చర్యలతో అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించడం జరిగిందన్నారు.
రానున్న రోజుల్లో కరోనా చికిత్సకు అవసరమైన మందుల తయారీదారులతో పాటు, వ్యాక్సిన్ తయారీదారులతో సమావేశమవుతాం. ప్రభుత్వం ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకునేందుకు సిద్ధంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం కరోనా కోసం చేపడుతున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఇతర రాష్ట్రాల పరిస్థితులతో పోలిస్తే తెలంగాణలో మెరుగైన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ చర్యలను కేంద్రం కూడా గుర్తించి ప్రశంసించింది. కరోనా కట్టడికి ఎప్పటికప్పుడు చర్యలను ముమ్మరం చేస్తూ మరింత సమగ్రంగా కార్యాచరణ తీసుకుని ముందుకు పోతామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
రాష్ట్రంలో 45 ఏళ్లకు పైబడి జనాభా 92 లక్షలుగా ఉంది. ఇందులో ఇప్పటికే 38 లక్షల మంది ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. వీరిలో 7.15 లక్షల మందితో పాటు 3 లక్షల మంది ఫ్రంట్ లైన్ వారియర్స్ ఇప్పటికే రెండు డోసులు తీసుకున్నారు. మొత్తంగా 10 లక్షలకు పైగా జనాభా పూర్తి వ్యాక్సిన్ తీసుకున్నారు.