వచ్చే యాసంగి కాలం నుండి వరి వేయడమంటే, రైతులు ఉరి వేసుకోవడమే

ప్రగతి భవన్ (తొలిపలుకు న్యూస్): తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టులను నిర్మించడం ద్వారా రైతు బంధు వంటి పంట పెట్టుబడి సాయం, 24 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్ వంటి ప్రోత్సాహకాల ద్వారా సాగు గణనీయంగా పెరిగి, రైతులు పంటలు బాగా పండిస్తున్నారని ఆదివారం జరిగిన సమావేశం అభిప్రాయపడింది. కేంద్ర ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించి వ్యవసాయ ఎగుమతులను అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సహించి, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర వ్యవసాయాధారిత పరిశ్రమలను ఇబ్బడి ముబ్బడిగా ప్రోత్సహిస్తే బాగుండేదని కానీ, కేంద్రం ఇలాంటివేమీ చేయకపోవడం వల్ల ఆహార నిల్వలు పేరుకు పోతున్నాయని చెప్పి తన బాధ్యతల నుండి కేంద్రం తప్పించుకోజూస్తున్నదని సమావేశంలో అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

బాయిల్డ్ రైస్ కొనేది లేదని కేంద్రం తెగేసి చెప్పిన దరిమిలా, ఇక వచ్చే యాసంగి కాలం నుండి వరి వేయడమంటే, రైతులు ఉరి వేసుకోవడమే అనే అభిప్రాయం వ్యక్తమైంది. గత యాసంగిలో రాష్ట్రం 92 లక్షల టన్నుల ధాన్యం సేకరించిందని, రైతులు ఈ వానాకాలంలో 55 లక్షల ఎకరాల్లో వరి ధాన్యం సాగు చేస్తున్నారని, దీని ద్వారా సుమారు 1 కోటి 40 లక్షల టన్నుల వరి ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా ఉందని, ఇప్పటికే సుమారు 70 లక్షల టన్నుల ధాన్యం ఇంకా రాష్ట్ర రైస్ మిల్లుల్లో, ఇతర ప్రదేశాల్లో నిల్వ ఉందని అధికారులు వివరించారు. వీటి దృష్ట్యా పీడీఎస్ తదితర అవసరాల మేరకు, కేంద్రప్రభుత్వం నిర్ధారించిన కోటా మినహా, మిగతా ధాన్యాన్ని కొనుగోలు చేయడం ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ విధానాల దృష్ట్యా సాధ్యం కాకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమైంది. రాష్ట్ర ప్రభుత్వంపై గత యాసంగిలో సేకరించిన ధాన్యం వల్ల సుమారు రూ.2,000 కోట్ల అదనపు భారం పడనుందని అధికారులు వివరించారు. వీటన్నింటి దృష్ట్యా యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలైన శనగలు, వేరు శనగలు, పెసర్లు, మినుములు, నువ్వులు, ఆవాలు, పొద్దు తిరుగుడు, ఆముదాలు, కూరగాయల లాంటివి పండిస్తే రైతులకు లాభాలు వస్తాయని సమావేశం అభిప్రాయపడింది.

గతంలో కరోనా వల్ల రైతులు ఎట్టి పరిస్థితుల్లో నష్టపోవద్దని రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల వ్యయ ప్రయాసలకోర్చి పూర్తి ధాన్యం కొనుగోలు చేసింది. కానీ, ఈ వర్షాకాలంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నిర్దారించిన 60 లక్షల టన్నుల ధాన్యం కొనుగోళ్లను ఐకేపీ కేంద్రాల ద్వారా కోటా మేరకు మాత్రమే ధాన్యం సేకరణ జరగాలని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. రైతులను చైతన్య పరిచేందుకు వ్యవసాయశాఖ అన్ని స్థాయిల్లోని అధికారులు తగు ప్రచారం నిర్వహించాలని సమావేశం అభిప్రాయపడింది.

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter

I consent to the terms and conditions