
పిర్జాదీగుడ: ఈరోజు క్యాబినెట్ మీటింగ్ లో లాక్ డౌన్ గురించి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చర్చించిన తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన పత్రికా ప్రకటన నాలుగు భాషల్లో (తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ) విడుదల చేశారు. ఆ వార్తను తెలంగాణ సీఎంఓ ట్విట్టర్‌లో పెడితే కొందరు తప్పుగా మాట్లాడిన విధానాన్ని చూసి మండిపడ్డారు పిర్జాదిగుడ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ జక్క వెంకట్ రెడ్డి.
తెలంగాణ ఏమన్నా పాకిస్తానా, సౌదీ అరేబియానా, రజాకార్ రాజ్యమా, ఎందుకు ఉర్దూలో పత్రికా ప్రకటనలు చేస్తున్నారు అని కొందరు వాగుతున్నారు.
దక్కనీ ఉర్దూ అనేది ఒక మధురమైన భాష. 14వ శతాబ్దం నుండి ఈ ప్రాంతంలో వ్యాప్తి చెందిన ఉర్దూ భాషలో అద్భుతమైన సాహిత్య సృష్టి జరిగింది. ఈ ప్రాంత సంస్కృతిలో, చరిత్రలో ఉర్దూ భాషది విడదీయరాని అనుబంధం.
తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ సర్, ఉద్యమ నాయకుడు కేసీఅర్ గారు అనర్గళంగా ఉర్దూలో మాట్లాడుతుంటే ఎంతో ఆసక్తిగా వినేది.
ఆనాడు తెలంగాణ తెలుగును “బాస్టర్డైజ్డ్ తెలుగు” అని కొందరు సమైక్యవాదులు ఈసడిస్తే, దానికి చెంపపెట్టు లాంటి సమాధానం కేసీఆర్ గారు ఇచ్చారు. “రాజమండ్రి జైలు నుండి ఖైదీల పరార్” అనే వార్తా శీర్షికలో ఎన్ని తెలుగు పదాలు ఉన్నాయి అని అడిగారు ఆయన. ప్రపంచంలో ఏ భాష అయినా ఇంకొన్ని భాషల నుండి పదాలను అరువు తెచ్చుకుని స్థానికీకరించుకుంటేనే ఏర్పడుతుంది. అలాగే ఉర్దూ భాష నుండి కూడా తెలుగు భాషలోకి ఎన్నో పదాలు అట్లా వచ్చి చేరినయి.
ప్రపంచంలో ఉర్దూ మాతృభాషగా కలిగిన వారు మన దేశంలోనే అత్యధికం. మన రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్ గుర్తించిన 22 భాషల్లో ఉర్దూ ఒకటి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఉర్దూ రెండో అధికార భాషగా మన ప్రభుత్వం ప్రకటించింది.
ఇదంతా తెలియక ఉర్దూ భాషను చూడగానే పాకిస్తాను, సౌదీ అరేబియా, రజాకార్ అని ద్వేషపు రాతలు రాసే మూర్ఖులకు కొంత బుద్ధీ జ్ఞానం కలగాలని సూచించారు..