ఇస్రో ప్రయోగాన్ని విజయవంతం చేసింది
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగాన్ని విజయవంతం చేసింది. శక్తిమంతమైన కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్-6ఏను అంతరిక్షంలోకి పంపించింది. ఇవాళ సాయంత్రం 4:56 గంటలకు శ్రీహరికోటలోని సతీశ్‌ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం(షార్) నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్08 రాకెట్ ద్వారా దీనిని నింగిలోకి పంపారు. ఉపగ్రహ ప్రయోగానికి సంబంధించి 27 గంటల కౌంట్‌డౌన్ బుధవారం మధ్యాహ్నం 1:56 గంటలకు ప్రారంభమైంది. దేశీయ కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ఇస్రో జీశాట్-6ఏ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది. రెండురోజుల క్రితం బెంగళూరులోని ఉపగ్రహ తయారీ కేంద్రం నుంచి జీశాట్-6ఏను భారీ భద్రత మధ్య శ్రీహరికోటకు తీసుకువచ్చారు. ప్రయోగించిన 17 నిమిషాల 46 సెకన్లలోనే రాకెట్ జీశాట్-6ఏ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. 2,140 కిలోల బరువున్న జీశాట్-6ఏ ఉపగ్రహాన్ని రూ.270కోట్ల ఖర్చుతో ఇస్రో తయారుచేసింది.
ప్రత్యేక యాంటెనాతో జీశాట్-6ఏ
ఇస్రో ఇప్పటివరకు 17 జీశాట్ ఉపగ్రహాలను ప్రయోగించగా, అందులో ప్రస్తుతం 12 సేవలందిస్తున్నాయి. ఇప్పుడు పంపుతున్న జీశాట్-6ఏలో ప్రత్యేక యాంటెనాను అమర్చారు. విచ్చుకుంటే ఆరుమీటర్ల వెడల్పు ఉండే ఈ యాంటెనా చూడడానికి గొడుగులా కనిపిస్తుంది. ఉపగ్రహం కక్ష్యలోకి చేరగానే ఇది తెరుచుకుంటుంది. రాకెట్ రెండో దశలో అధిక విస్ఫోటనం కలిగిన వికాస్ ఇంజిన్‌తోపాటు ఎలక్ట్రోహైడ్రాలిక్‌కు బదులుగా ఎలక్ట్రోమెకానికల్ యాక్చువేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఈ ఏడాదే చంద్రయాన్2 ప్రయోగం: శివన్
జీఎస్‌ఎల్వీ ఎఫ్08 ప్రయోగం విజయవంతం కావడంపై ఇస్రో ఛైర్మన్ శివన్ హర్షం వ్యక్తంచేశారు. ఈ ప్రయోగాన్ని విజయవంతం చేసిన శాస్త్రవేత్తలకు, అందుకు సహకరించిన వారి కుటుంబ సభ్యులకు ఆయన అభినందనలు తెలిపారు. తొమ్మిది నెలల్లో 10 మిషన్లకు ప్రణాళిక రూపొందించామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఇందులో భాగంగా ఈ ఏడాది చంద్రయాన్ 2 ప్రయోగం కూడా ఉంటుందని ప్రకటించారు. ఈ విజయం ఇస్రో శాస్త్రవేత్తలకు అంకితమని ప్రకటించారు.
జీశాట్6ఏ ప్రత్యేకతలు
ఈ ఉపగ్రహం.. ఖమల్టీ బీమ్ కవరేజీ’ సౌకర్యం ద్వారా దేశవ్యాప్తంగా మొబైల్ కమ్యూనికేషన్‌ను అందిస్తుంది. ఇది ఐదు స్పాట్ బీమ్స్‌లలో ఎస్‌బ్యాండ్‌ను, ఒక బీమ్‌లో సిబ్యాండ్‌ను కలిగి ఉంటుంది. ఉపగ్రహంలో కమ్యూనికేషన్ల సంధానత కోసం 6 మీటర్ల వ్యాసం కలిగిన ఖవిచ్చుకునే యాంటెన్నా’, హబ్ కమ్యూనికేషన్ లింక్ కోసం 0.8 మీటర్ల స్థిర యాంటెన్నా ఉంటాయి.
విచ్చుకునే యాంటెన్నా..
ఈ ఉపగ్రహంలో విచ్చుకునే యాంటెన్నాను ఏర్పాటు చేశారు. దీని వెడల్పు 6 మీటర్లు. జీశాట్6ఏ.. కక్ష్యలోకి చేరాక ఇది గొడుగులా విచ్చుకుంటుంది. ఈ ఉపగ్రహం కోసమే దీన్ని ప్రత్యేకంగా రూపొందించారు. సాధారణంగా ఇస్రో ఉపయోగించే యాంటెన్నాల కన్నా ఇది మూడు రెట్లు పెద్దది. చేతిలో ఇమిడిపోయే భూతల టెర్మినళ్ల ద్వారా ఎక్కడి నుంచైనా మొబైల్ కమ్యూనికేషన్లు సాగించడానికి ఇది వీలు కల్పిస్తుంది. సైనిక అవసరాలకూ ఉపయోగపడుతుందని సమాచారం.
ఏమిటీ ఎస్‌బ్యాండ్?
ఎస్‌బ్యాండ్ అనేది విద్యుదయస్కాంత స్పెక్ట్రమ్‌లో ఒక భాగం. 2 నుంచి 4 గిగాహెర్జ్ (జీహెచ్‌జెడ్) పౌనఃపున్యాల నడుమ అది ఉంటుంది. ఈ బ్యాండ్‌ను వాతావరణాలకు సంబంధించిన అన్ని రాడార్లు, నౌకలు, కొన్ని కమ్యూనికేషన్ ఉపగ్రహాల్లో వాడుతున్నారు. 2.5 జీహెచ్‌జెడ్ బ్యాండ్‌ను ప్రపంచవ్యాప్తంగా 4జీ సేవలకు వాడుతున్నారు. అందువల్ల ఎస్‌బ్యాండ్ చాలా ప్రయోజనకరమైంది. ఇది వందలకోట్ల డాలర్ల విలువ చేస్తుంది. మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ సేవలకు ఇది కీలకం.
12వ వాహకనౌక..
జీశాట్6ఏ ఉపగ్రహాన్ని మోసుకెళుతున్న జీఎస్‌ఎల్‌వీఎఫ్08.. జీఎస్‌ఎల్‌వీ మార్క్2 శ్రేణికి చెందినది. భారత్ అభివృద్ధి చేసిన రాకెట్లలో రెండో అతిపెద్దది. ఆ శ్రేణి రాకెట్‌ను ప్రయోగించడం ఇది 12వ సారి. ఈ వాహకనౌకలో దేశీయ క్రయోజెనిక్ ఇంజిన్ ఉంటుంది. స్వదేశీ క్రయో ఇంజిన్‌తో ప్రయోగాన్ని చేపట్టడం ఇది ఆరోసారి. 2014 జనవరి తర్వాత వరుసగా నాలుగు సార్లు ఈ రాకెట్ ప్రయోగాలు విజయవంతమయ్యాయి.