BusTerminals hyderabad

హైదరాబాద్ మహానగరంలో నాలుగు బస్సు టెర్మినళ్లను నిర్మించనున్నారు

హైదరాబాద్ మహానగరంలో నాలుగు బస్సు టెర్మినళ్

విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్యను నివారించడం, మెరుగైన ప్రయాణ సదుపాయాలను కల్పించేందుకు హెచ్‌ఎండీఏ చర్యలను ముమ్మరం చేసింది. ఇతర రాష్ర్టాల నుంచి వాహనాలు హైదరాబాద్‌కు రాకపోకలుసాగించే జాతీయ, రాష్ట్రీయ రహదారులకు చేరువగా నాలుగు బస్సు టెర్మినళ్లను నిర్మించనున్నారు. మియాపూర్, మనోహరాబాద్, పెద్ద అంబర్‌పేట, శంషాబాద్‌ను ఎంపిక చేసి ఒక్కోదానికి రూ.70 కోట్ల నుంచి రూ.100 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. వీటిని కనీసం 100 బస్సులకు తగ్గకుండా నిలిపే సామర్థ్యంతో నిర్మించనున్నారు. ఈ టెర్మినళ్లలో డ్రైవర్లకు, ఇతర సిబ్బందికి అవసరమైన సదుపాయాలు, బడ్జెట్ హోటళ్లు, ఫుడ్‌కోర్టులు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, పరిపాలనా కార్యాలయాలు, పార్కింగ్ సౌకర్యం, పెట్రోల్ బంకులు, సర్వీస్ స్టేషన్లు, సరుకుల రవాణా తదితర సౌకర్యాలు కల్పిస్తారు. ఓవైపు నగరం శరవేగంగా విస్తరిస్తుండటం, మరో వైపు ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరుగుతున్న దృష్ట్యా.. నగర శివార్లలో అంతర్జాతీయ హంగులతో ఇంటర్‌సిటీ బస్ టెర్మినల్స్ (ఐసీబీటీ) నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

BusTerminalsఈ నేపథ్యంలో జాతీయ రహదారులకు సమీపంలో అత్యాధునిక హంగులు, అంతర్జాతీయ ప్రమాణాలు, సకల మౌలిక వసతులతో కూడిన బస్ టెర్మినళ్ల నిర్మాణానికి హెచ్‌ఎండీఏ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఇందులో భాగంగా తొలిదశలో బస్ టెర్మినళ్ల నిర్మాణానికి నాలుగు ప్రాంతాలను ఎంపికచేసింది. మియాపూర్, మనోహరాబాద్, పెద్ద అంబర్‌పేట, శంషాబాద్ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అవసరాన్ని బట్టి 20-100 ఎకరాల వరకు స్థలం అవసరమవుతుందని అంచనా వేశారు. రెండు ప్రాంతాల్లో కొద్దిమేర ప్రైవేట్ భూమిని సేకరించాల్సి ఉన్నది. వీటిని భూ సమీకరణ (ల్యాండ్ ఫూలింగ్ స్కీం) పథకం ద్వారా సేకరించాలని హెచ్‌ఎండీఏ కమిషనర్ చిరంజీవులు నిర్ణయించారు. ఈ నాలుగు టెర్మినళ్లను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) పద్ధతిలో చేపట్టనున్నారు. వీటి నిర్మాణానికి సంబంధించి డీపీఆర్, లావాదేవీల సలహాదారు (ట్రాన్జాక్షన్ అడ్వైజర్) నియామకానికి టెండర్లను పిలువనున్నారు. ఆసక్తి గల ఏజెన్సీల నుంచి ప్రతిపాదనలు స్వీకరించనున్నారు. త్వరలో సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నారు. మియాపూర్ ఐసీబీటీ నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న న్యాయపరమైన చిక్కులను అధిగమించి త్వరలో పనులు ప్రారంభించాలని హెచ్‌ఎండీఏ అధికారులు భావిస్తున్నారు.

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter

I consent to the terms and conditions