ఐటీ కారిడార్‌లో సొరంగ మార్గం!
హైదరాబాద్ మహానగరంలో సొరంగ మార్గం అందుబాటులోకి రానుంది. ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ పెట్టేలా.. దుర్గం చెరువు పరిసరాలను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేలా జీహెచ్‌ఎంసీ వినూత్న ప్రణాళికలు రూపొందించింది. రాష్ట్రంలోనే మొట్ట మొదటిసారి హైటెక్ సిటీలో సొరంగ మార్గం నిర్మాణానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రాజెక్టు సమగ్ర నివేదిక (డీపీఆర్) సిద్ధమైంది. త్వరలో ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నారు. సొరంగ మార్గం, అనుసంధానంగా నిర్మించే ఫ్లై ఓవర్ల నిర్మాణానికి రూ.1500 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. సొరంగ మార్గానికి రూ.280 కోట్లు, అనుసంధాన ఫ్లై ఓవర్ల నిర్మాణానికి రూ.1220 కోట్లు ఖర్చవుతుందని ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
ఇనార్బిట్ మాల్ నుంచి ఊప గుట్ట వరకు 500 మీటర్ల మేర ఫ్లై ఓవర్, గుట్టను తొలిచి 500 మీటర్ల మేర సొరంగ మార్గం నిర్మించనున్నారు. గుట్టకు అవతలి వైపు ఫైనాన్షియల్ డిస్ర్టిక్ట్ (ఎమ్మార్ ప్రాపర్టీస్) వరకు 3.8 కిలోమీటర్ల మేర మరో ఫ్లై ఓవర్ నిర్మించనున్నారు. సాధారణంగా ఫ్లై ఓవర్ నిర్మాణానికి చదరపు మీటరుకు రూ.30వేలు ఖర్చవుతుంది. అధునాతన విధానంలో నిర్మించనున్న ఈ సొరంగ మార్గానికి మాత్రం భారీగా ఖర్చు కానుంది. చదరపు మీటరుకు రూ.2లక్షలు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. ఒక్కో వైపు నాలుగు లేన్‌ల చొప్పున రెండు వైపులా వేర్వేరుగా 8 లేన్ల సొరంగ మార్గం నిర్మించనున్నారు. ఊప గుట్టకు అవతలి వైపు ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా ఫైనాన్షియల్ డిస్ర్టిక్ట్ వరకు ఫ్లై ఓవర్ నిర్మించనున్నారు. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే… టెండర్ నోటిఫికేషన్ ప్రకటిస్తామని ఓ అధికారి చెప్పారు.