మునుగోడు గడ్డ.. బీసీల అడ్డా: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
మునుగోడు గడ్డ.. బీసీల అడ్డా: జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి
“ఎన్నికల సమయం వచ్చిందంటే చాలు బీసీ ఓటర్లకు గేలం వేయాలని ప్రతి ఒక్క పార్టీ చూస్తూ ఉంటుంది. అదే బీసీలకు టికెట్లు ఇవ్వడానికి మాత్రం వెనుకాడుతూ ఉంటారు. ప్రస్తుతం తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక చుట్టూ రాజకీయం సాగుతోంది. అయితే బీసీ అభ్యర్థులను బరిలోకి దింపడానికి మాత్రం వెనుకాడుతూ ఉన్నాయి. ఇప్పటికే బీజేపీ తీర్థం పుచ్చుకున్న లగడపాటి రాజగోపాల్ రెడ్డి ఓసీ అభ్యర్థి కాగా.. ఇక మిగిలిన పార్టీలైనా బీసీ అభ్యర్థిని బరిలోకి దింపితే బాగుంటుంది.. బీసీలకు మేలు చేసినట్లు అవుతుంది” అని అన్నారు జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి.
‘మునుగోడు గడ్డ.. బీసీల అడ్డా’ అని మరోసారి నినదించారు దుండ్ర కుమారస్వామి. కొన్ని దశాబ్దాలుగా అక్కడ ఓసీల పాలన సాగుతూ ఉందని.. ఇకనైనా బీసీలందరూ ఐక్యమవ్వాలని పిలుపును ఇచ్చారు. బీసీ అభ్యర్థికి టికెట్ ఇస్తే.. తప్పకుండా గెలిపించుకుంటామని.. సగర్వంగా అసెంబ్లీకి పంపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు బీసీలు మునుగోడులో ఇతరుల పల్లకీ మోయాలని.. ఇకనైనా బీసీలకు టికెట్లు ఇస్తే అధికారం వారి చేతుల్లోనే ఉంటుందని అన్నారు. బీసీ ప్రజలు మునుగోడులో బీసీ అభ్యర్థిని గెలిపించుకుంటారని దుండ్ర కుమారస్వామి అన్నారు. మునుగోడులో బీసీ ఓటర్ల శాతం చాలా ఎక్కువగా ఉంది.. బీసీలందరూ ఏకమైతే తప్పకుండా బీసీ అభ్యర్థిని అసెంబ్లీ లోకి పంపించవచ్చు.. బీసీలందరూ సమిష్టిగా కృషి చేస్తే మునుగోడు అసెంబ్లీ స్థానం బీసీదే అని అన్నారు దుండ్ర కుమారస్వామి. రాబోయే రోజుల్లో పలు కార్యక్రమాలను నిర్వహించి బీసీలలో చైతన్యం వచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు. బీసీల అభివృద్ధి సాగాలంటే చట్ట సభల్లో బీసీ నాయకులు ఉండాల్సిందేనని చెప్పారు దుండ్ర కుమారస్వామి. బీసీలలో రాజకీయ చైతన్యం మునుగోడు నుండే మొదలు కానుందని అన్నారు జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు.
బీసీ దళ్ జాతీయ కార్యాలయంలో బీసీ పలు బిసి సంఘాల ముఖ్య నాయకులతో బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి భేటీ నిర్వహించారు. మునుగోడు ఉపఎన్నికల అంశంపైనా, బీసీ సంఘాల ఐక్యత పైనా ఈ సమావేశంలో చర్చించారు. బీసీల అభివృద్ధి జరగాలంటే బీసీలే పదవుల్లో ఉండాలని.. అందుకు తగ్గట్టుగా కార్యాచరణ జరగాలని ఈ సమావేశంలో చర్చించారు. బీసీ దళ్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పద్మ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచాల యుగేందర్ గౌడ్, శేకర్ దామోదర చారి మరియు ఇతర ముఖ్య నాయకులు హాజరయ్యారు.
బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి ప్రధాన కార్యదర్శి
రాచాల యుగేందర్ గౌడ్ మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి మునుగోడులో ఓసీలకే టికెట్లు ఇస్తూ వస్తున్నారని అన్నారు. కేవలం నాలుగు శాతం మాత్రమే ఉన్న సామాజిక వర్గానికి రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని.. బీసీలకు టికెట్ ఇచ్చిందే లేదని అన్నారు. ఇకనైనా బీసీలకు టికెట్లు ఇవ్వాలని ఆయన కోరారు. బీసీ అభ్యర్థికి సీటు ఇస్తే మాత్రం అన్ని సంఘాలు ఏకమై పార్టీలకు అతీతంగా గెలిపించుకుంటామని అన్నారు. బీసీలను అణగదొక్కాలని చూస్తే మాత్రం.. వారి ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుందని హెచ్చరించారు.