ప్రపంచ ఆరోగ్య దినోత్సవం – ఏప్రిల్ 7, 2025
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా “అందరికీ మంచి ఆరోగ్యం 2025” అనే గొప్ప లక్ష్యంతో బ్లిస్‌బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్ సంస్థ ఆధ్వర్యంలో సోమవారం రోజు విశేష కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో ఆరోగ్య సమస్యలపై చైతన్యం కల్పించడం, మంచి ఆహారపు అలవాట్లను ప్రోత్సహించడం, పరిశుభ్రతను మెరుగుపరచడం వంటి కీలక అంశాలతో సమాజంలో సానుకూల పెను మార్పు తీసుకురావాలని తాము గట్టిగా కంకణం కట్టుకున్నామని తెలిపారు. “ఆరోగ్యమే అసలైన సంపద అని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటేనే సంతోషకరమైన జీవనం సాధ్యమవుతుంది,” అని ఆయన అన్నారు. “నీ ఆరోగ్యం నీ చేతిలో ఉంది, దాన్ని బలంగా నమ్మాలని ఆయన సూచించారు.
ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకోవడం, వాటిని నివారించే మార్గాలను కనుగొనడం ఈ రోజు మనందరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. “ఆరోగ్యంతోనే జీవనం మధురమవుతుంది,” అని ఆయన అన్నారు. పోషకాహారం తీసుకోవడం ద్వారా శరీరాన్ని బలంగా తీర్చిదిద్దుకోవాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. “నీవు తినేదే నీ ఔషధం, ఆరోగ్యమే నీకు సర్వం” అనే నినాదం ఈ సందేశాన్ని స్పష్టంగా తెలియజేస్తుందన్నారు. అలాగే, శుభ్రతను పాటిస్తే వ్యాధులను దూరం చేసి, ఆరోగ్యవంతమైన జీవితం గడపవచ్చని, “పరిశుభ్రతతోనే ఆరోగ్యం నీ సొంతమవుతుంది” అని ఆయన వివరించారు.
“2025 నాటికి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండేలా ప్రేరణ కల్పించడం, సమాజంలో మంచి మార్పు తీసుకురావడమే మా లక్ష్యం. ఒక్క అడుగు ముందుకు వేస్తే, ఆరోగ్య ప్రపంచం నీ వెంటే ఉంటుంది,” అని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం మనలో కొత్త ఉత్సాహాన్ని నింపి, ఆరోగ్యవంతమైన భవిష్యత్తు కోసం శ్రమించేలా ప్రేరణనివ్వాలని తాము కోరుకుంటున్నామని, “ఆరోగ్యం కోసం ఈ రోజు లేస్తే, రేపటి జీవనానికి బీజం వేసినట్లే” అనే సూక్తి ఈ సందేశాన్ని బలపరుస్తుందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో దుండ్ర కుమారస్వామి వైద్య నిపుణుడు డాక్టర్ వినయ్ సరికొండ ని సన్మానించారు. డాక్టర్లు, మేధావులు, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని, ఆరోగ్య సందేశాన్ని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తమ వంతు కృషి చేశారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మనమంతా కలిసి ఆరోగ్యవంతమైన జీవనం వైపు అడుగులు వేద్దామని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.