మోహన్ బాబుని వెంటనే అరెస్ట్ చేయాలి: జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమార స్వామి
సినీ నటుడు మోహన్ బాబు మీడియాపై చేసిన దాడిని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తీవ్రంగా ఖండించారు.డబ్బు పరపతి ఉందన్న అహంకారంతో మీరు ఇలా రెచ్చిపోయి ప్రవర్తిస్తే చూస్తూ ఎవరూ ఉండరని గుర్తుపెట్టుకోవాలన్నారు. గొప్ప నటుడిగా పేరు ఉన్నా.. మంచి వ్యక్తిత్వం లేనప్పుడు అదంతా నిరుపయోగమేనని మోహన్ బాబు గుర్తుపెట్టుకోవాలి. మీడియాపై దాడి చేసిన మోహన్ బాబుని చట్టం శిక్షించాలని డిమాండ్ చేశారు.
జర్నలిస్టులపై దాడి హేయమైన చర్య అని వెంటనే మోహన్ బాబు ని అరెస్ట్ చేయాలని కుమారస్వామి డిమాండ్ చేశారు. ఇదేమీ పెదరాయుడు సినిమా కాదు.. లేదా రాయుడు సినిమా కూడా కాదు. మీకు నచ్చినట్లు ప్రవర్తించాలంటే సినిమా లోని క్యారెక్టర్ కాదని సూటిగా ప్రశ్నించారు. మీరు తిట్టినా, కొట్టినా పడి ఉండే వాళ్లు మీడియాలో లేరని గుర్తుపెట్టుకోవాలి. క్రమశిక్షణ క్రమశిక్షణ అని అంటుంటారు కదా.. ఇష్టమొచ్చినట్లు రెచ్చిపోవడమేనా మీ క్రమశిక్షణ అని దుండ్ర కుమారస్వామి అన్నారు. మీడియాకు చెందినవారు మీ కుటుంబంలో ఏదో జరుగుతుందని తెలిసి అక్కడికి వచ్చారు.. మీరు చేసిన దాడిలో తీవ్ర గాయాలై ఒక వ్యక్తి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు.. అతడికి ఏదైనా జరగరానిది జరిగితే ఎవరి బాధ్యత. విచక్షణ మరచి మీరు ప్రవర్తించిన తీరు తెలుగు చలనచిత్ర పరిశ్రమకే కళంకం తెచ్చిపెట్టింది. తన బిడ్డ ఇంటి లోపల ఉందని మంచు మనోజ్ చెపుతున్నాడు.. ఇచ్చి పంపించేసి ఉంటే ఇంత రచ్చ అయి ఉండేది కాదు కదా. మీడియా మీద మీరు చేసిన దాడి దురహంకారానికి ప్రతీక అని గుర్తుంచుకోవాలి. భవిష్యత్తులో దాడులు జరగకుండా అరికట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం.