డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు
మాజీ ఛైర్మన్, తెలంగాణ బీసీ కమిషన్
బషీర్బాగ్‌లో బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళి
బాబూజీ ఆశయాలు సామాజిక విధానాలకు మార్గదర్శకంగా నిలవాలి – డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు
బాబూ జగ్జీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకుని బషీర్బాగ్‌లో ఆయన విగ్రహానికి ఘనంగా పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ బీసీ కమిషన్ ఛైర్మన్ డా. వకుళాభరణం కృష్ణమోహన్ రావు మాట్లాడుతూ – “బాబూజీ కేవలం రాజకీయ నాయకుడే కాదు… భారత రాజ్యాంగాన్ని సామాజిక న్యాయ మార్గంలో పయనింపజేసిన విప్లవాత్మక చైతన్యం” అని కొనియాడారు.
వంచిత వర్గాలకు బాబూజీ ఆశయాలు వెలుగు కావాలి:
సామాజిక సమానత్వం, ఆర్థిక న్యాయం, రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాలపై బాబూజీ పోరాటం చేసినప్పటికీ, ఇవన్నీ నేటికీ వంచిత వర్గాలకు పూర్తిగా అందుబాటులో లేవని ఆయన అభిప్రాయపడ్డారు. “వారి ఆశయాలను కేవలం జయంతి కార్యక్రమాలకు పరిమితం చేయకుండా, ప్రభుత్వాల విధానాలలో వాటిని మూలసూత్రాలుగా మలచాల్సిన అవసరం ఉంది” అని తెలిపారు.
నివాళి కాదు – కార్యాచరణ అవసరం:
రిజర్వేషన్లు, సామాజిక సాధికారత, విద్యా అవకాశాల్లో సమానత్వం, గ్రామీణ ఉపాధి కార్యక్రమాలు వంటి అంశాలపై బాబూజీ వేసిన బాటను నేటి పాలకులు కార్యరూపంలో చూపించాలన్నారు. “ఇవి బాబూజీ సిద్ధాంతాల మూలసూత్రాలు. వాటిని అమలు చేయడమే నిజమైన నివాళి” అని స్పష్టం చేశారు.
నేతలకూ, యువతకూ బాబూజీ జీవితంలో పాఠాలున్నాయి:
పట్టుదల, నైతికత, ప్రజల పట్ల బాధ్యత – ఇవన్నీ బాబూజీ లోకం చాటిన విలువలు. ఇవే నేటి యువతకు అవసరమైన దిక్సూచి కావాలని డా. వకుళాభరణం పేర్కొన్నారు.
సమకాలీన భారతానికి మార్గనిర్దేశకుడు:
సామాజిక న్యాయం నినాదంగా కాకుండా, రాజ్య విధానంగా రూపుదిద్దుకోవాలంటే బాబూజీ ఆశయాల పట్ల బలమైన నిబద్ధత అవసరం అని తెలిపారు. దేశాన్ని సమతామూలక దిశగా నడిపించేందుకు బాబూజీ చూపిన మార్గం ఇప్పటికీ అత్యంత సమకాలీనంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు, సామాజిక కార్యకర్తలు, వివిధ వర్గాల నాయకులు పాల్గొని బాబూజీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.