జస్టిస్ తొట్టత్తిల్ భాస్కరన్‌నాయర్ రాధాకృష్ణన్
తెలంగాణ, ఏపీ రాష్ర్టాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ తొట్టత్తిల్ భాస్కరన్‌నాయర్ రాధాకృష్ణన్ శనివారం ప్రమాణస్వీకారంచేశారు. రాజ్‌భవన్‌లో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ జస్టిస్ రాధాకృష్ణన్‌తో ప్రమాణం చేయించారు. అనంతరం గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ ఆయనను అభినందించారు. రాష్ట్ర విభజన తర్వాత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టిన మొదటివారు జస్టిస్ రాధాకృష్ణన్. రాష్ట్ర విభజన జరిగేనాటికి ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్‌గుప్తా విభజన అనంతరం 2015 మే 7న పదవీ విరమణ చేసేదాకా కొనసాగారు. ఆ తర్వాత తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తులుగా జస్టిస్ బాబా సాహెబ్ భోసలే, జస్టిస్ రమేశ్ రంగనాథన్ కొనసాగారు. 38 నెలల తర్వాత పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిగా శనివారం జస్టిస్ రాధాకృష్ణన్ ప్రమాణంచేశారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌తోపాటు ప్రతిపక్ష నేత జానారెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తులు, విశ్రాంత న్యాయమూర్తులు, ఉభయ తెలుగు రాష్ర్టాల డీజీపీలు, న్యాయవాదులు, హైకోర్టు సిబ్బంది హాజరయ్యారు.