banking_fintech

రూ. 250 కోట్లకు పైబడిన రుణాల మంజూరు, పర్యవేక్షణకు ఓ నిర్దిష్టమైన వ్యవస్థ

రుణాల మంజూరు, పర్యవేక్షణకు ఓ నిర్దిష్టమైన వ్యవస్

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో రూ. 11,515 కోట్ల మోసం జరిగాక కానీ కేంద్ర ప్రభుత్వానికి సెగ తగల్లేదు. ఇక మీదట రూ. 250 కోట్లకు పైబడిన రుణాల మంజూరు, పర్యవేక్షణకు ఓ నిర్దిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ విదేశాల్లోని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. ‘ఏ అవసరం కోసం అంత భారీ రుణం ఇచ్చారో.. ఆ పని జరుగుతోందా లేదా అన్నది పర్యవేక్షించండి. ఎంతెంత చెల్లింపులు చేయాలి, బాకీలు ఎప్పుడు తీర్చారు, ఇంకా ఎంత తీర్చాలి, ఎంత తీరుస్తారు? మొదలైన వివరాలు తక్షణం రాబట్టండి’ అని ఆర్థిక శాఖ- హాంకాంగ్‌ సహా విదేశాల్లోని నాలుగు బ్యాంకులు- స్టేట్‌ బ్యాంకు, ఏక్సిస్‌ బ్యాంకు, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, అలహాబాద్‌ బ్యాంకుల శాఖలకు ఆదేశాలిచ్చింది. ముంబైలోని ఓ పీఎన్‌బీ బ్రాంచి జారీ చేసిన ఎల్‌ఓయూల ఆధారంగా నీరవ్‌ మోదీకి హాంకాంగ్‌లోని ఈ నాలుగు బ్యాంకుల శాఖలే ఎక్కువగా డబ్బు విడుదల చేశాయి. రూ 250 కోట్ల పైబడ్డ రుణ వ్యవహారాల ను నిరంతరం పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఓ వ్యక్తిని లేదా ఓ నిర్దిష్ట వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నది ఆర్థికశాఖ ఇచ్చిన ఉత్తర్వు. స్కాం బయటపడ్డాక ఈ శాఖ తీసుకున్న మొదటి గట్టి చర్య ఇదే. ఇప్పటికే జారీ చేసిన ఎల్‌ఓయూలకు సంబంధించిన లావాదేవీలు త్వరగా మొదలయ్యేట్లు చూడాలని ఆదేశాలిచ్చింది.

 

అదేవిధంగా.. ఒక వ్యక్తికి లేదా సంస్థకు పెద్ద మొత్తంలో రుణం ఇచ్చేటపుడు కన్సార్టియంగా ఏర్పడే బ్యాంకుల సంఖ్య ఏడుకు మించరాదనే షరతు విధించింది. 17 బ్యాంకులు కలిసి కన్సార్టియంగా ఏర్పడి విజయ్‌ మాల్యాకు రూ. 9,000 కోట్ల మేర అప్పులిచ్చాయి. అలాగే ఏడు బ్యాంకులు కలిసి విక్రమ్‌ కొఠారీకి రూ. 3,695 కోట్లదాకా అప్పు ఇచ్చాయి. అటు పీఎన్‌బీ కూడా విదేశాల్లోని భారతీయ బ్యాంకుల శాఖలకు చెల్లింపులు జరిపే వ్యవస్థ (స్విఫ్ట్‌) నిబంధనలను కఠినతరం చేసింది. సీనియర్‌ అధికారులకు మాత్రమే స్విఫ్ట్‌ కోడ్‌ అందుబాటులో ఉంటుంది. కిందిస్థాయి ఉద్యోగులకు ఇకమీదట ఈ పాస్‌వర్డ్‌ ఇవ్వరు. అదే విధంగా రుణాల మంజూరు, కీలక లావాదేవీలు జరిపే వ్యవస్థల్లోనూ మార్పులు తెచ్చారు. పెద్ద పెద్ద మొత్తాలలో చెల్లింపుల క్లియరెన్స్‌ను సీనియర్‌ ఉద్యోగులు, ఆఫీసర్ల చేతుల్లోనే పెట్టారు. కుంభకోణం దరిమిలా బ్యాంకు తీవ్ర ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయి- ఎవరికీ ఏ చెల్లింపులూ జరపలేని పరిస్థితుల్లో లేదని పీఎన్‌బీ స్పష్టం చేసింది . నెత్తిమీద పడ్డ భారాన్ని మోయగల నగదు, ఆస్తులు తమ దగ్గరున్నాయని, ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఓ ప్రకటనలో పేర్కొంది. ‘బకాయిలు రాబట్టుకునేందుకు చట్టపరంగా ఏ చర్యలు తీసుకోవాలో అవి తీసుకుంటున్నాం.. న్యాయపరంగా కూడా పోరాడతాం. బాధ్యలపైనా చర్యలు మొదలయ్యాయి’ అని బ్యాంకు వివరించింది.

Zeen is a next generation WordPress theme. It’s powerful, beautifully designed and comes with everything you need to engage your visitors and increase conversions.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter

I consent to the terms and conditions