మాదాపూర్ : ఈ కరోనా కష్ట కాలంలో లక్ డౌన్ వల్ల బీసీ కుల వృత్తులు, చేతి వృత్తులు పూర్తిగా దెబ్బతిన్నాయని, ఆకలిచావులు సంభవించే ప్రమాదం ఏర్పడిందని బీసీ దళ్ జాతీయ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మాదాపూర్ “బీసీ దళ్” ప్రధాన కార్యాలయంలో బీసీ దళ్ వ్యవస్థాపక అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అధ్యక్షతన, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు సుందర్ కల్లూరి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో, దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ… బీసీ కుల ఫెడరేషన్లలో స్వయం ఉపాధి రుణాల కోసం దరఖాస్తులు చేసిన వారు, మార్జిన్ మనీ డిపాజిట్ కింద 50% డబ్బును అప్పులు చేసి డిపాజిట్ చేశారని తెలిపారు. బీసీలకు రుణాలివ్వకుండా బీసీ కార్పొరేషన్ నిర్లక్ష్యం చేస్తోందని కుమారస్వామి ధ్వజమెత్తారు. బీసీ కార్పొరేషన్ కు మూడేళ్ల క్రితం దరఖాస్తు చేసుకున్న 5.77 లక్షల మందికి రుణాలు అందజేయాలన్నారు. వెంటనే బీసీ కార్పొరేషన్ ద్వారా ఒక్కో కుటుంబానికి లక్ష నుంచి 5లక్షల రాయితీ రుణాలు మంజూరు చేసి, ప్రతి కుటుంబానికి 50 కిలోల ఉచిత బియ్యం పంపిణీ చేసి ఆదుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కోరారు.
ఈ సందర్భంగా బీసీ దళ్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు సుందర్ కల్లూరి మాట్లాడుతూ..
కరోనా వల్ల లాక్ డౌన్ తో బీసీలు ఆర్థికంగా చితికిపోయారని, వారికి సబ్సిడీ రుణాలు ఇచ్చి ఆదుకోవాలన్నారు. స్వయం ఉపాధి పథకాల కోసం దరఖాస్తు చేసుకుని ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నా కూడా రుణాలు ఇవ్వకుండా ప్రభుత్వం జాప్యం చేస్తుందని, బీసీలకు రుణాలివ్వకుండా బీసీ కార్పొరేషన్ నిర్లక్ష్యం చేస్తోందని, మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12 బీసీ కులాలకు ఫెడరేషన్లు ఉన్నాయని, వీటిని కార్పొరేషన్లుగా మార్చాలని సుందర్ కల్లూరి డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 56 బీసీ కులాలకు, ఏపీలో తరహా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని కోరారు. ఇటీవల ప్రకటించిన 120 ప్రభుత్వ బీసీ జూనియర్ కాలేజీల్లో వెంటనే అడ్మిషన్లు ప్రారంభించాలన్నారు.
ఈ కార్యక్రమంలో బీసీ దళ్ ముఖ్య నాయకులు మరియు ముచ్చర్ల గణేష్ యాదవ్, అనిల్ నాయక్, రాజు, గణేష్, మారుతీ సాగర్, వంశీకృష్ణ, నాగరాజు, శివకుమార్ బీసీ దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు..