హైదరాబాద్ : కరోనా విషయంలో ప్రజలు భయాందోళన గురికావద్దని సీఎం కోరారు. ఎవరికైనా ఏమాత్రం అనుమానం వచ్చినా టెస్టుల కోసం ఆందోళన చెందకుండా ముందస్తుగా ప్రభుత్వం అందించే కోవిడ్ మెడికల్ కిట్లను వినియోగించుకోవాలన్నారు. ఆశా వర్కర్లు, ఎఎన్ఎం ల ద్వారా ఇంటింటికీ అందచేస్తామన్నారు. ఇందులో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించే కరపత్రంతో పాటు మందులు అందజేస్తారని తెలిపారు.
రాష్ట్రంలో లాక్ డౌన్ ఎందుకు విధంచగూడదనే విషయం గురించి సీఎం లోతైన విశ్లేషణ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ… ‘‘లాక్ డౌన్ వల్ల ఉపయోగం లేదు. తెలంగాణ రాష్ట్రం ఇండియాలో మోస్ట్ హాపెనింగ్ స్టేట్ కావడం వల్ల ఇక్కడ 25 నుంచి 30 లక్షల మంది ఇతర రాష్ట్రాలనుంచి కార్మికులు పనిచేస్తున్నారు. మొదటి వేవ్ కరోనా సమయంలో లాక్ డౌన్ విధించడం ద్వారా వీరందరి జీవితాలు చల్లా చెదురైన పరిస్థితిని మనం చూసాం. వీరంతా డిస్ లొకేట్ అయితే తిరిగి రావడం కష్టం. అదే సమయంలో రాష్ట్రంలో ధాన్యం పుష్కలంగా పండింది. తెలంగాణ వ్యాప్తంగా గ్రామల్లో 6144 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వరి ధాన్యం నిండివున్నది. ప్రస్థుతం అక్కడ వడ్ల కాంటా నడుస్తున్నది. వరి కొనుగోలు అంటే ఆశామాశీ వ్యవహారం కాదు. దీనిలో కింది నుంచి మీది దాక చైన్ సిస్టం ఇమిడి వుంటది. ఐకెపి కేంద్రాల బాధ్యులు, హమాలీలు, తూకం వేసేందుకు కాంటా పెట్టేవాల్లు మిల్లులకు తరలించే కూలీలు లారీలు ట్రాన్స్పోర్టు వెహికిల్స్ మిల్లులకు చేరవేయడం అక్కడ తిరిగి దించడం మల్లా అక్కడినుంచి ఎఫ్.సి.ఐ గోడౌన్లకు తరలించడం మల్లీ అక్కడ దించడం స్టాక్ చేయడం తిరిగి వివిధ ప్రాంతాలకు పంపిణీ చేయడం… ఇంత వ్యవహారం వుంటది. ఈ మొత్తం వ్యవహారంలో లక్షలాది మంది భాగస్వాములౌతారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి రైసు మిల్లుల్లో పనిచేస్తున్న కార్మికులు ఏమౌతారు? లాక్ డౌన్ విధిస్తే ఇంతమంది ఎక్కడపోతారు? కార్మికులు చల్లాచెదురైపోతే తిరిగి వారిని రప్పించడం ఎట్లా? కోనుగోలు చేయకపోతే పండించిన వరి ధాన్యాన్ని రైతు ఎక్కడ పెట్టుకుంటాడు? మొత్తం ధాన్యం కొనుగోల్ల వ్యవస్థ ఎక్కడికక్కడ స్థంభించి పోయే ప్రమాదమున్నది. తద్వారా సంభవించే సంక్షోభం ఘోరంగా వుండే ప్రమాదం వుంది. అదే సమయంలో నిత్యావసర సరుకులు, పాలు కూరగాయలు పండ్లు ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసులు, ప్రసవాలు, పారిశుధ్య కార్యక్రమాలు వంటి అత్యవసర కార్యక్రమాలను ఆపివేయలేం. అదే సమయంలో ఇతర రాష్ట్రాల నుంచి వ్యాక్సీన్లు, మెడిసిన్, ఆక్సీజన్లను ఇతర నిత్యావసరాలను సరఫరా చేసుకుంటున్నం ఓక వేల లాక్ డౌన్ విధిస్తే వీటన్నిటికి ఆటంకం ఏర్పడుతది. ఇన్ని కారణాల వల్ల ప్రభుత్వమే ఒక భయానక పరిస్థితిని సృష్టించినట్లవుతుంది అందుకు ప్రభుత్వం సిద్దంగా లేదు… కాబట్టి లాక్ డౌన్ విధించలేం.
అదే సమయంలో కేసులు ఎక్కువగా వున్న ప్రాంతాలను గుర్తించి వాటిని, మైక్రోలెవల్ కంటైన్మెంట్ జోన్లను ప్రకటించి కరోనా నిరోధక చర్యలను తక్షణమే చేపడుతాం.. అని సీఎం వివరించారు. సీఎం మాట్లాడుతూ… ‘‘అదే సందర్భంలో పరిశ్రమలు ఉన్నఫలంగా మూతపడితే అంతా ఆగమాగం కాదా. క్యాబ్, ఆటోలు, డ్రైవర్ల పరిస్థితి ఏమిటి? కొన్ని లక్షల కుటుంబాలు ఉపాధికోల్పోయే పరిస్థితి తలెత్తి మొత్తం వ్యవస్థ కుప్పకూలే ప్రమాదమున్నది. కరోనా ఏమోగాని ఆకలి సంక్షోభం తలెత్తే ప్రమాదమున్నది. గొంతు పిస్కినట్టు చేస్తే మొత్తం రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలిపోయే ప్రమాదమున్నది. కాబట్టి గతంలో అనుభవాలను దృష్టిలో వుంచుకోని లాక్ డౌన్ ను విధంచకూడదని ప్రభుత్వం నిర్ణయించింది.’’ అని సీఎం స్పష్టం చేశారు.
కరోనా నియంత్రణ కోసం ప్రజలు కూడా పూనుకోవాలనీ, ప్రతి వ్యక్తీ స్వచ్ఛందంగా కరోనా మీది యుద్ధంలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు. సమిష్టిగా అందరం కలిసి కొట్లాడితేనే కరోనా అంతమౌతుందని అన్నారు. మేధావులు, బుద్దిజీవులు ఈ దిశగా ప్రజలను చైతన్యవంతం చేయాలని కోరారు.
కరోనా నియంత్రణలో ప్రాణాలకు తెగించి పాటుపడుతున్న వైద్య ఆరోగ్యశాఖకు కరోనా అభివందనాలు తెలియచేశారు. వైద్యులు, నర్సులు, ఆశా వర్కర్లు, ఎఎన్ఎంలు తదితర వైద్య సిబ్బంది గొప్ప సేవ చేస్తున్నారని వారి కృషి త్యాగం గొప్పదని కొనియాడారు. రెండో వేవ్ మే 15 తర్వాత కరోనా తీవ్రత తగ్గిపోతుందని రిపోర్టులు సూచిస్తున్నాయన్నారు. వ్యాధి నిరోధానికి ఎవరికివారే జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలే స్వీయ నియంత్రణ పాటించాలన్నారు. గుంపులు గుంపులుగా తిరగొద్దని పెండ్లిల్లలో వందకు మించి జమ కావద్దని తెలిపారు. పరిశుభ్రత పాటించాలని, సానిటైజర్లు వాడాలని, మాస్కులు ధరించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని తెలిపారు. ఇటువంటి జాగ్రత్తలే శ్రీరామ రక్షగా పేర్కొన్నారు.