కరోనా మహమ్మరి ఎక్కువ అవుతుండటం, పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం, ఆక్సిజన్ కొరత ఏర్పడటం, మరణాల సంఖ్య ఎక్కువ అవుతున్న నేపద్యంలో, బుధవారం మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగిన ఈ సంఘటన ఒక్కసారిగా అందరిని షాక్ కి గురిచేసింది. జాకీర్ హుస్సేన్ ఆసుపత్రిలో ఆక్సిజన్ నింపుతుండగా ఆక్సిజన్ ట్యాంక్ అకస్మాత్తుగా లీక్ కావడం ప్రారంభమైంది. దీంతో ఆ ప్రాంతమంతా గ్యాస్ వ్యాపించడంతో అక్కడ తీవ్ర భయాందోళన వాతావరణం ఏర్పడింది. అగ్నిమాపక సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ పరిణామంతో ఆక్సిజన్ సరఫరా 30 నిమిషాల పాటు నిలిచిపోయింది. ఫలితంగా ఆక్సిజన్ అవసరమయ్యే 80 మందిలో 31 మంది రోగులను ఇతర ఆసుపత్రులకు తరలించారు. దీనిపై మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ జాకీర్ హుస్సేన్ స్పందించారు. మరింత సమాచారం సేకరించిన తరువాత ప్రకటన విడుదల చేస్తామని తెలిపారు. కాగా మహారాష్ట్రలో గత 24 గంటల్లో 58,924 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 351 మంది మరణించారు. దీంతోమొత్తం కేసు 38,98,262 కు చేరుకోగా, మరణాల సంఖ్య 60,824కు చేరుకుంది.