హైదరాబాద్: కరోనా ఉదృతి ఎక్కువ అవుతుండటంతో తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రాత్రి 9 తర్వాత దుకాణాలు, హోటళ్లు, బార్లు మూత పడనున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో మూవీ థియేటర్ల నిర్వహణపై ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల సమావేశం జరిగింది. బుధవారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా థియేటర్లను మూసివేయనున్నట్లు ఈ సమావేశంలో ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. ‘వకీల్‌సాబ్’ ప్రదర్శించే థియేటర్లు మినహా మిగతావి మూసివేయాలని నిర్ణయించారు. కరోనా ఉద్ధృతి, ప్రేక్షకుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు తెలిపారు.
దీనితోపాటు మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది, అత్యవసరమైతే తప్ప సినిమా చిత్రీకరణ చేయకూడదని నిర్ణయించుకుంది. ఈ మేరకు తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. అత్యవసర పరిస్థితుల్లో కొవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ 50 మందితోనే సినిమాల చిత్రీకరణ, నిర్మాంణాంతర కార్యక్రమాలను జరుపుకోవాలని నిర్మాతల మండలి సూచించింది. సినీ పరిశ్రమ మనుగడ, కార్మికుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చలన చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కళ్యాణ్ ప్రకటించారు