రాకెట్ సైన్స్ ఓ బ్రహ్మపదార్థం. రాకెట్ నిర్మాణం అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. అనేక సున్నితమైన పరికరాల సముదాయం. పదుల సంఖ్యలో సిబ్బంది రోజుల తరబడి శ్రమిస్తే రాకెట్ తయారవుతుంది. కానీ.. ‘48 గంటల్లోనే రాకెట్ విడిభాగాలను ఏకంచేసి లాం చింగ్ సిద్ధం చేయాలి’ స్కైరూట్ లక్ష్యంగా నిర్దేశించుకున్నది. ఈ ఏడాది చివరినాటికి దానిని సాకారం చేసుకొనేందుకు సిద్ధమవుతున్నది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు చెందిన మాజీ శాస్త్రవేత్తలు పవన్‌కుమార్ చందన, నాగభరత్‌తో పాటు మరికొందరు 2018 జూన్ 12న ‘స్కైరూట్’ స్టార్టప్‌ను ప్రారంభించారు. సొంతంగా రాకెట్లను అభివృద్ధి చేస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ‘విక్రమ్-1’ రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపి ఉపగ్రహాలను కక్ష్యలోకి పెట్టనున్నట్టు ప్రకటించారు. ఇంజిన్లు, రాకెట్ల అభివృద్ధి, పరీక్షల కోసం ఇస్రో సహకారం తీసుకుంటున్నారు.
వినూత్న ఆలోచనలే పెట్టుబడిగా..
‘వినూత్న ఆలోచనలకు శ్రమ తోడైతే విజయం ఖాయం’ అనే మాటను స్కైరూట్ నిజం చేసి చూపిస్తున్నది. రాకెట్ బరువును తగ్గించడం, తక్కువ ఇంధనంతో ఎక్కువ దూరం వెళ్లగలిగేలా చేయడం, వేగంగా రాకెట్లను సిద్ధం చేయడం ప్రధాన లక్ష్యాలుగా నిర్దేశించుకున్నది. ప్రస్తుతం ఈ సంస్థ ‘స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికిల్స్’ను (ఎస్‌ఎస్‌ఎల్వీ) అభివృద్ధి చేస్తున్నది. వీటికి విక్రమ్-1, 2, 3 అని నామకరణం చేసింది. వీటి పేలోడ్ సామర్థ్యం 525 కిలోల నుంచి 720 కిలోల వరకు ఉన్నది. వీటికోసం ప్రత్యేకంగా ‘కలాం’ పేరుతో రాకెట్ ఇంజిన్లను రూపొందిస్తున్నది. ఈ ఏడాది చివరన ప్రయోగించనున్న ‘విక్రమ్-1’లో వినియోగించనున్న ‘కలాం-5’ ఇంజిన్‌ను ఇటీవలే టెస్ట్ ఫైర్ చేసింది. ‘ఆర్బిట్ అడ్జస్ట్‌మెంట్ మాడ్యూల్’ (ఓఏఎం) టెక్నాలజీ సాయంతో ఒకేసారి ఒకటికంటే ఎక్కువ ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపేందుకు ప్రయత్నిస్తున్నది.