కరోనా టీకా కోసం మరెంతో కాలం ఎదురు చూడాల్సిన అవసరం లేదని, మరికొన్ని వారాల్లో టీకా అందుబాటులోకి రావొచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. శాస్త్రవేత్తల నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని శుక్రవారం వర్చువల్‌గా జరిగిన అఖిలపక్ష భేటీలో పేర్కొన్నారు. వ్యాక్సినేషన్‌లో వైద్య సిబ్బంది, పోలీసులు, మున్సిపల్ సిబ్బంది, తీవ్రమైన వ్యాధులతో బాధపడ్తున్న వృద్ధులు.. మొదలైన వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు.
ఇటీవల పుణే, హైదరాబాద్, అహ్మదాబాద్‌ల్లోని టీకా ప్రయోగశాలలను సందర్శించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. తమ ప్రయోగాలు కచ్చితంగా విజయవంతమవుతాయని అక్కడి శాస్త్రవేత్తలు గట్టి నమ్మకంతో ఉన్నారని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా పలు టీకాలు ప్రయోగదశల్లో ఉన్నప్పటికీ.. చవకగా, సమర్ధవంతంగా పనిచేసే టీకా కోసమే అంతా ఎదురు చూస్తున్నారన్నారు. అభివృద్ధి చెందిన చాలా దేశాల కన్నా భారత్ కరోనా మహమ్మారిని సమర్ధవంతంగా ఎదుర్కొందని ప్రధాని పునరుద్ఘాటించారు. పలు దేశాల్లో మళ్లీ కేసుల సంఖ్య పెరుగుతోందని, అందువల్ల భారత్‌లోనూ జాగ్రత్తలు తీసుకోవడం కొనసాగించాలని కోరారు.