బడుగు బలహీన వర్గాల ఆషా జ్యోతి మహాత్మా జ్యోతి రావు ఫూలే కి ఘన నివాళి అర్పించిన కుమార స్వామి
భారత దేశ మార్గదర్శి , కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మహానుభావుడు. స్త్రీలు చదువుకోవాల్సిందే అని పట్టుబట్టి ప్రత్యేక స్కూల్ ఏర్పాటు చేసిన గొప్ప సంఘ సంస్కర్త. బడుగు, బలహీన, పీడిత వర్గాలకు అండగా నిలిచిన పోరాట యోధుడు మహాత్మా జ్యోతిరావు గోవిందరావు ఫూలే అని , భౌతికంగా ప్రపంచాన్ని వదిలి 130 ఏళ్లయినా, బడుగుల మేలు కోసం పూలే పడిన ఆరాటo ఇప్పటికీ స్ఫూర్తిని పంచుతోంది అని తెలంగాణ రాష్ట్ర బిసి దళ్ రాష్ట్ర అధ్యక్షులు దుండ్ర కుమార స్వామి తెలిపారు. మహాత్మా జ్యోతిరావు గోవిందరావు ఫూలే పుణ్యతిథి సందర్భంగా హైదరాబాద్ లోని బిసి దళ్ రాష్ట్ర కార్యాలయం లో ఘన నివాళి అర్పించారు.
సమాజంలో అన్ని వర్గాలకూ సమాన హక్కులు ఉండాలనీ స్త్రీలు సంఘంలో భాగం కావాల్సిందే అని పోరాటం చేసి దేశాన్నే మేల్కొలిపిన మహనీయుడు. అగ్రవర్ణాల నుంచి కుల వివక్షను ఎదుర్కొన్నా ఆఖరికి చదువుకునేందుకు పరిస్థితులు సహకరించకున్నా అన్నీ తట్టుకుని అందరి కోసం జీవితం అంకింతం చేసిన మహానుభావుడు ఫూలే అని ఈ సంధర్భంగా చెప్పారు. వెనకబడిన కుటుంబంలో పుట్టి చిన్నప్పటి నుంచే కష్టాలు ఎదుర్కొన్న ఫూలే సత్య శోధక్ సమాజ్ పేరుతో ఓ సంస్థ ఏర్పాటు చేశారు. బలహీన వర్గాల తరఫున పోరాడారు. వారికి అన్ని హక్కులూ అందాలని గొంతెత్తారు.
వర్ణ, కుల వ్యవస్థకు ప్రాణం పోసిన ”మనుస్మతికి, సామాజిక వివక్షకు వ్యతిరేకంగా జ్యోతిరావు ఫూలే అవిశ్రాంతంగా పోరాటం చేశారు. మమతానురాగాల మానవీయ సమాజ స్థాపన కోసం అహర్నిశలు కృషి చేసి సైద్ధాంతిక, విద్యా రంగాల్లో ఉద్యమాలను నిర్మించడం, వాటికోసం సంస్థలను నెలకొల్పడం వంటివి చేశారు అని కుమార స్వామి కొనియాడారు. మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలను కొనసాగించడమే బీసీ దళ్ లక్ష్యమని కుమార స్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో బిసి దళ్ నాయకులు పలువురు నాయకులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.