లక్ష్య సాధనకు పేదరికం అడ్డంకి కాదు అని హరిత హారంలో మణిహారం అని నిరూపించిన నెనావత్ బలరాం నాయక్ – ఎందరికో ఆదర్శం
నెనావత్ బలరాం నాయక్ తను సివిల్స్ సాధించే వరకు ఎవరికి పెద్దగా పరిచయం లేని పేరు ఇది కాని 2009 లో 834 ర్యాంకు సాధించి అత్యున్ననత భారతీయ రెవిన్యూ సర్వీసెస్ సాధించడం ద్వారా అతని పేరు బాహ్య ప్రపంచానికి తెలిసింది. సకల సౌకర్యాలు ఉండి గొప్ప గొప్ప కోచింగ్ సెంటర్లలో తర్ఫీదు పొందిన వ్యక్తులు ఐ.ఆర్.ఎస్. సాధించడంలో ఇంతగా చెప్పుకోడానికి ఏమి ఉండక పోవచ్చు కాని అతి పేద కుటుంబంలో పుట్టి పొట్టకూటి కోసం కులీ పనులు చేసుకుంటూ, ఆటో డ్రైవర్ గా జీవితం గడిపిన ఓ సామాన్య గిరిజనుడు ఇలాంటి ఘనత సాధించడం జాతి గర్వించదగ్గ విషయమే. అంతే కాదు, జీవితం సాఫీగా సాగడంలేదనో, పరీక్షల్లో మార్కులు తగ్గాయనో లేదా ఫెయిల్ అయ్యామనో, ఆశించిన ఫలితములు రాలేదనో ఆత్మహత్యలకు పాల్పడి తమ విలువైన జీవితాలను కోల్పోతున్న విద్యార్థి యువ లోకానికి ఈయన జీవన పోరాటం, సాధించిన విజయాలు స్పూర్తిదాయక పాఠముల వంటివి.
వలసకూలీల జిల్లాగా పేరుపొందిన పాలమూరు మహబూబ్ నగర్ జిల్లా, బాలానగర్ మండలం, తిరుమలగిరి తండాలో శ్రీ.హున్యా మరియు శ్రీమతి.కేశి ల ఏడుగురు సంతానంలో మొదటివాడు బలరాం. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. అసలే కరువు కాటకాలలు వెంటాడే జిల్లా కావడం, జీవనోపాధికి వ్యవసాయ పనులు కుడా సరిగ్గా దొరక్క తినడానికి కుడా దొరకని గడ్డు పరిస్థితుల్లో ఏంతో దయనీయంగా కుటుంభాన్ని వేల్లదిసేవారు. బలరాం తిరుమలగిరి తండా లోనే ఏడో తరగతి వరకు ప్రాధమిక విద్యను అభ్యసించి తదుపరి జడ్చర్ల ప్రభుత్వ ప్రాధమికోన్నత పాటశాలలో పదవతరగతి పూర్తి చేసారు. చదువుకుంటూనే తల్లిదండ్రులతో పాటు వ్యవసాయ కూలీగా పనులకు వెళ్లి వారికి చేదోడు వాదోడుగా ఉండే వాడు.
రోజు రోజుకి కుటుంభ పోషణ భారం కావడంతో వీరి కుటుంభం బ్రతుకుదెరువు కొరకు హైదరాబాద్ కు వలస వచ్చింది. బాగ్ లింగంపల్లి లో చిన్న అద్దె ఇంట్లో తల్లిదండ్రులతో ఉంటూ దగ్గరలోని అంబేద్కర్ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఎం.పి.సి. కోర్సులో జాయిన్ అయ్యారు. చదవడానికి తగిన పుస్తకాలు కొనుక్కోవడమే కుదరని పరిస్థితి, ఇంట్లో సభ్యులందరూ తినడానికి మాత్రమె సరిపోయే చాలీ చాలని సంపాదన కావడంతో చదువుతూనే తండ్రి పనిచేసే గ్యాసు కంపనీలో సిలెండర్లు మోసేవాడు. కాలం కలిసిరాక కష్టతరమైన ఇంటర్ ఎం.పి.సి. పరీక్ష తప్పడంతో ఇక చదువు మాని వేరే పని చేసుకొని బ్రతకమని తల్లిదండ్రులు 18సం.ల వయసులోనే బలరాంకు పెళ్లి చెయ్యాలని నిర్ణయించారు. దాంతో తల్లిదండ్రుల మాటకు తలొగ్గి 1998 లో శారద గారిని పెళ్ళాడారు. ఇంటర్ ఫెయిల్ అయి చదువు అక్కడితో ఆపెయ్యకుండా వివాహానంతరం సైన్సు నుండి గ్రూప్ మారి తిరిగి ఇంటర్ సి.ఇ.సి. గ్రూప్ తీసుకోని చదివారు. వారి జీవనోపాది కొరకు ఒక ఆటో ని అద్దెకి తీసుకోని ఆటో డ్రైవర్ గా జీవితం ప్రారంభించారు. తన భార్య బట్టల దుకాణంలో పని చేస్తూ భర్త కష్టసుఖాల్లో పాలుపంచుకునేది.
తన భార్య ప్రోత్సాహం సహకారంతో చిన్ననాటి కలల్ని సాకారం చేసుకునే దిశగా తగిన చదువు కొనసాగించాలని నిశ్చయించుకొని ఆటో నడుపుతూనే ఓపెన్ యూనివర్సిటీ లో బి.ఎ. (ఇ.పి.పి.) చదివి ఎం.ఎ. (ఎం.పి.పి.) కుడా పూర్తీ చేసారు. అప్పటికే బలరాం ముగ్గురు పిల్లల తండ్రి కూడాను. తన చదువుకు ఫీజులు, పిల్లల పోషణ కొరకు ఆటో డ్రైవర్ గా 2005 వరకు అదే వృత్తిలో కొనసాగారు బలరాం. తదుపరి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎం.ఫిల్. డిగ్రీ కుడా పూర్తీ చేసి తన లక్ష్య సాధనకొరకు సివిల్స్ సాధించడమే ధ్యేయంగా ఎ.పి.స్టడీ సర్కిల్ లో జాయిన్ అయ్యి గ్రూప్స్ సాధించడం కొరకు కఠోర సాధన చేసారు. మధ్యలో రాష్ట్ర ప్రభుత్వ ఎ.పి.పి.ఎస్.సి. నిర్వహించిన గ్రూప్-1 మరియు గ్రూప్-2 పరీక్షలలో తన శ్రమకు ఫలితం దక్కకున్నా నిరాశ పడలేదు. స్వామి వివేకానందుడి ‘భయపడకు ఎన్నిసార్లు పరాజయం పొందావో ఆలోచించకు దాన్ని లెక్కచెయ్యకు, కాలం అనంతరం ముందుకు సాగిపో, నీ ఆత్మ శక్తిని మరలా కూడగట్టుకో, వెలుగు వచ్చే తీరుతుంది’ అను మాటల నుండి ప్రేరణ పొంది ఎలాగైనా ఉన్నతస్థాయి ఉద్యోగం సాధించడమే ఏకైక లక్ష్యంగా 2009లో యు.పి.ఎస్.సి. రాసి 834 వ ర్యాంకు సాధించి ఇండియన్ రెవిన్యూ సర్వీసెస్ లో స్థానం సాధించి ఒక్కసారిగా నెనావత్ బలరాం అనే పేరును బయట ప్రపంచానికి పరిచయం చేసాడు.
తను సాధించిన విజయంతో ‘మనిషనేవాడు కారాదు మట్టిబొమ్మ – పట్టుదలే ఉంటె కాగలడు మరో బ్రహ్మా’ అనే వేటూరి మాటల్ని నిజం చేసారు. బలరాం జీవితాన్ని, సాధించిన విజయాల్ని పరిశీలిస్తే, ఎందరో నిరుపేదలకు ఉండే అనేకానేక కష్టాలు, ఆర్ధిక సామాజిక సమస్యలు, వెనుకబాటు తనం, వనరుల లేమి, పరిమితులు ఇతనొక్కని జీవితంలోనే ప్రతిఫలిస్తున్నాయి కానీ ఎక్కడైనా ఒక గొప్ప ప్రయాణం ఒకేవోక్క అడుగుతో మొదలవుతుంది. ఎన్నో సవాళ్ళు, ఎదురు దెబ్బలు, పరాజయాలు ఇవేవి వారి ప్రయాణాన్ని, వారిలోని ధృడమైన సంకల్పాన్ని అడ్డుకోలేవు.
ఐ.ఆర్.ఎస్.గా అనేక ఉన్నత పదవులు బలరాం గానికి వరించాయి. అందులో దేశ ఆర్ధిక రాజధాని ముంబై కస్టమ్స్ (ఎగుమతులు) డిపార్టుమెంటు లో డిప్యుటి కమీషనర్ గా సమర్ధవంతమైన విధులు నిర్వర్తించి 2018 డిసెంబర్ లో తన స్వంత రాష్ట్రం తెలంగాణలోని సింగరేణి కాలరీస్ కంపనీ లిమిటెడ్ లో బోర్డు అఫ్ డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ & ఫైనాన్సు)గా నియమితులయ్యారు. కంపేనీ విధులతో పాటు తన ప్రవృత్తికి తగ్గట్టుగా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. తనలా చదువుకోవడానికి ఇబ్బందులు పడే పేద విద్యార్థులకోసం 4 గ్రంధాలయాలు నెలకొల్పి నిర్వహిస్తున్నారు. 30,000 పుస్తకాలకు పైగా విద్యార్థులకు పంపిణి చేసారు. ‘వాక్ ఫోర్ వాటర్’ అనే స్వచ్ఛంద సంస్థకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. అబ్దుల్ కలాం ఫౌండేషన్ ఆధ్వర్యంలోని ‘ఇగ్నిటింగ్ మైండ్స్’ యువత లోని సృజనాత్మకతను తట్టి లేపి నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించి ప్రపంచంలోనే భారత దేశాన్ని అగ్రగామి దేశంగా చూడాలనే సంకల్పంతో ‘ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియా బై 2032’ అని కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగస్వామిగా బలరాం గారు అవకాశం చిక్కినప్పుడల్లా యువత దేశ ప్రగతికి తోడ్పడే విధంగా స్ఫూర్తిదాయకమైన సందేశాలు ఇస్తున్నారు. ఆ సంస్థ ప్రారంభించిన అనేక కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ప్రారంభిస్తూ ఇతరులకు స్పూర్తిగా నిలుస్తున్నారు. వీరి కార్యక్రమాల్లో ఒకటైన ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యంతో దేశంలో పచ్చదనం పెంచే ‘గ్రీన్ చాలెంజ్’ కార్యక్రమం బలరాం లో సామాజిక భాద్యతను మరింత పెంచింది. తాను స్వతహాగ అనేక మొక్కలు నాటి వాటిని పరిరక్షించడం కోసం ప్రత్యెక శ్రద్ధ తీసుకుంటున్నారు. మానవ జీవితానికి స్వచ్చమైన నీరు, గాలి, ఆరోగ్యదాయకమైన పరిసరాలు ఏంతో అవసరం మరియు వాటిని పొందడం మనుష్యుల ప్రాధమిక హక్కుగా భారత సర్వోన్నత న్యాయస్థానంతో తో పాటు అన్ని అంతర్జాతీయ సంస్థలు గుర్తించాయి. వేగంగా అంతరించి పోతున్న అడవులు, పెరిగిపోతున్న భూతాపం, మితిమీరిన వాయు కాలుష్యం భారి నుండి మనల్ని, మన భావి తరాల్ని రక్షించుకోడానికి వృక్ష సంపదను పెంచుకోవడం తక్షణ అవసరం. ఈ అవసరాన్ని గుర్తించే తెలంగాణ ప్రభుత్వం కుడా రాష్ట్రం అవతరించగానే ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమం ప్రారంభించింది.
గనుల నిర్వహణలో జరిగే పర్యావరణ అసమతుల్యాన్ని గణనీయంగా తగ్గించే దిశగా సింగరేణి కంపెని అధ్వర్యంలోనే సుమారు మూడున్నర కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నారు. బలరాం సింగరేణిలో ఉన్నతమైన పదవిలో ఉండి కుడా హరితహారం కార్యక్రమం నిర్వహించిన ప్రతిసారి, తానే స్వయంగా అత్యదిక మొక్కలు నాటుతూ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రజలకు, ఇతర ఆఫీసర్స్ కు, కార్మికులకు స్పూర్తిగా నిలుస్తున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు 105 మొక్కలు నాటగా, జూలై 20వ తేది, 2019 నాడు కేవలం ఒకే ఒక్క గంటలో అత్యధికంగా 1237 మొక్కలు నాటిన వ్యక్తిగా తన పేరును ‘హై రేంజ్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్’ లో నమోదు చేసుకున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున కొత్తగూడెం ఏరియా లో 516 మొక్కలు నాటి తన దేశభక్తిని చాటుకున్నారు. భూపాలపల్లి ఏరియా లో హరితహారం కార్యక్రమంలో పాల్గొని 621 మొక్కలు నాటారు. ఇప్పటివరకు బలరాం స్వయంగా 3500 కు పైగా మొక్కలు నాటి హరితహారం కార్యక్రమానికే మణిహారంలా నిలుస్తున్నారు.