మోదీ.. మోదీ.. మోదీ..!! రెండుమూడు రాష్ర్టాలు మినహా దేశమంతటా ఇదే నినాదం! హిందీయేతర రాష్ర్టాల్లోనూ అదే హవా! గత ఎన్నికల్లో భారీ సంఖ్యలో సీట్లు సాధించి అధికారంలోకి వచ్చిన బీజేపీ.. తన రికార్డును తానే బద్దలు కొట్టుకుంటూ రెండోసారి అధికార పగ్గాలు స్వీకరించనున్నది. బీజేపీ సొంతంగా 303 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. ఎన్డీయే మిత్రులతో కలుపుకొంటే ఆ స్థానాలు 349కి చేరుకున్నాయి. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న జాతీయపార్టీ కాంగ్రెస్.. 52 సీట్లతో సరిపెట్టుకున్నది. కాంగ్రెస్, మిత్రపక్షాలు 93 స్థానాల్లో గెలువగా, ఇతరులు వంద స్థానాల్లో విజయం సాధించారు. పెద్ద నోట్ల రద్దు కష్టాలు, జీఎస్టీతో పడిన ఇబ్బందులు, నిరుద్యోగ సమస్య, వ్యవసాయ సంక్షోభం పూర్వపక్షమైపోయాయి.
జాతీయ భద్రత, జాతీయవాదం, హిందూత్వ నినాదాలు.. ముందువరుసకు వచ్చాయి. రాహుల్ చేసిన చౌకీదార్ చోర్ హై నినాదాలు, రాఫెల్ స్కాం ఆరోపణలు పనిచేయలేదు. న్యాయ్ పేరుతో న్యాయం చేస్తానన్న వాగ్దానాలూ జనాన్ని మెప్పించలేదు. గత ఎన్నికల్లో ఒక శిఖరం అధిరోహించిన బీజేపీ.. నేడు మరో శిఖరాన్ని అవలీలగా అధిరోహించింది. నెహ్రూ, ఇందిర తర్వాత వరుసగా రెండోసారి పూర్తి మెజార్టీతో గెలుపొందిన మూడో ప్రధానిగా, తొలి కాంగ్రెసేతర ప్రధానిగా మోదీ రికార్డు నెలకొల్పారు. సరైన, సమర్థ నాయకుడు, మోదీ తరహాలో ప్రధాని అభ్యర్థి లేని ప్రతిపక్షం చతికిలపడింది. ప్రతిపక్షాల్లోనూ ఐక్యత లేకపోవడం బీజేపీకి మరో సానుకూల అంశంగా మారింది. అవకాశాలు వచ్చినా ఉపయోగించుకోలేని కాంగ్రెస్ నాయకత్వ లోపం మరోసారి కొట్టొచ్చినట్టు కనిపించింది. కాంగ్రెసేతర, బీజేపీయేతర విపక్షాలతో కూడిన ప్రాంతీయ పార్టీల సమాఖ్య కూటమి ఏర్పాటు ఆవశ్యకతను ఫలితాలు నొక్కిచెప్పాయి. అదేసమయంలో వివిధ రాష్ర్టాల్లో ప్రాంతీయ పార్టీలు తమ సత్తా చాటాయి. తమిళనాడులో మొత్తం 38 స్థానాలకుగాను డీఎంకే 23 విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ 22 స్థానాల్లో గెలుపొందింది. కేరళ, పంజాబ్‌లలో కాం గ్రెస్ మెరుగనిపించుకుంది. తెలంగాణలోటీఆర్‌ఎస్ తొమ్మిది స్థానాల్లో విజయం సాధించింది.
దేశమంతా మోదీ నినాదం మారుమోగింది. తిరుగులేని విజయం సాధించిన బీజేపీ.. రెండోసారి అధికార పగ్గాలు చేపట్టబోతున్నది. ప్రధాని నరేంద్రమోదీ జాతీయవాదం, జాతీయభద్రత, హిందూత్వ నినాదాలు దేశవ్యాప్తంగా ఓటర్లను ఆకర్షించాయి. సమకాలీన భారతదేశ చరిత్రలో తిరుగులేని నాయకుడిగా మోదీని నిలబెట్టాయి. పూర్తిస్థాయి మెజార్టీతో రెండోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించబోతున్న ఘనతను నరేంద్రమోదీ ఈ ఎన్నికల్లో సాధించారు. అబ్‌కీ బార్ తీన్‌సౌ పార్ అన్న మోదీ నినాదం ముందు కాంగ్రెస్ అధ్యక్షుడి చౌకీదార్ చోర్‌హై నినాదం నిలువలేకపోయింది. మొత్తం 542 స్థానాలకు ఎన్నికలు జరుగగా, బీజేపీ సొంతంగా 303 స్థానాల్లో విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ప్రతిపక్షాలను ఛిన్నాభిన్నం చేసింది. కాంగ్రెస్ ఆశలపై నీళ్లు కుమ్మరించింది. ఆ పార్టీని 52 సీట్లకు పరిమితంచేసింది. గత ఎన్నికల్లో బీజేపీ 282 స్థానాలు సాధించింది. భాగస్వామ్య పక్షాలతో కలుపుకొని 336 స్థానాల్లో గెలుపొందగా, ఈసారి ఆ రికార్డును తిరగరాస్తూ 349 స్థానాల్లో ఎన్డీయే జయకేతనం ఎగురవేసింది. మరోసారి మోదీ ప్రధాని కానున్నారని తొలి ఫలితాల్లోనే వెల్లడికావడంతో వివిధ రాష్ర్టాల్లో బీజేపీ శ్రేణులు పండుగచేసుకున్నాయి. పార్టీ కార్యకర్తలు, నేతలు పటాకులు కాల్చుతూ, నృత్యాలు చేస్తూ, మిఠాయిలు తినిపించుకున్నారు. మోదీ తాను పోటీచేసిన వారణాసి నియోజకవర్గంలో 4.79 లక్షల మెజార్టీతో గెలుపొందగా, పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా గాంధీనగర్‌లో 5.5 లక్షల పైచిలుకు మెజార్టీ సాధించారు. ఎన్నికల ఫలితాలతో స్టాక్‌మార్కెట్లు ఎగిసిపడ్డాయి. సెన్సెక్స్ తొలిసారి 40వేలను దాటగా, నిఫ్టీ 12వేల మార్కును అధిగమించింది. అటు డాలరుతో రూపాయి మారకం విలువ 14 పైసలు పెరిగి.. రూ.69.51కి చేరుకున్నది.
హిందీయేతర రాష్ర్టాల్లోనూ బీజేపీ హవా
మోదీ హవా ఊహించిన విధంగా కేవలం హిందీ రాష్ర్టాలు, గుజరాత్‌లోనే కాకుండా పశ్చిమబెంగాల్, ఒడిశా, మహారాష్ట్ర, కర్ణాటకల్లోనూ తీవ్రంగానే ఉన్నది. దక్షిణాదిలో కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఇందుకు మినహాయింపు. తెలంగాణలో ఏమీ రావనుకున్నప్పటికీ నాలుగు స్థానాల్లో విజయం సాధించింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలోనూ బీజేపీ గణనీయమైన ఫలితాలు రాబట్టింది. మధ్యప్రదేశ్‌లో 29కిగాను 28 స్థానాల్లో, రాజస్థాన్‌లో 25 సీట్లకుగాను 24 స్థానాల్లో జయభేరి మోగించింది. ఛత్తీస్‌గఢ్‌లో 11కుగాను 9 స్థానాల్లో బీజేపీ, రెండింటిలో కాంగ్రెస్ గెలుపొందాయి. హర్యానాలో పది సీట్లకుగాను తొమ్మిదింటిలో బీజేపీ అభ్యర్థులు గెలిచారు. ఒడిశాలో, బీహార్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమబెంగాల్‌లోనూ బీజేపీ ఇదే తరహాలో విజయాలు సాధించింది.
మెజార్టీ అసెంబ్లీ స్థానాలు గెలిచి ప్రతిపక్షంలో కూర్చొన్న కర్ణాటకలో మొత్తం 28 స్థానాలకుగాను 25 సీట్లను గెలుచుకున్నది. ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోటగా భాసిల్లిన బెంగాల్‌లో వామపక్షాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. మొట్టమొదటిసారి లోక్‌సభలో బెంగాల్ నుంచి లెఫ్ట్ పార్టీలకు ప్రాతినిధ్యం లేకుండాపోయింది. ఏపీలో 22 సీట్లలో వైసీపీ విజయం సాధించింది. టీడీపీ మూడు సీట్లతో సరిపెట్టుకున్నది. తమిళనాడులో డీఎంకే తనకు తిరుగులేదని నిరూపించుకున్నది. ఇక్కడ 38స్థానాలకు గాను 23 సీట్లలో డీఎంకే, 8 స్థానాల్లో కాంగ్రెస్, 3 స్థానాల్లో లెఫ్ట్ పార్టీలు గెలిచాయి. కేరళలో కాంగ్రెస్‌కు కాస్తంత ఊరటనిచ్చే ఫలితాలు వెలువడ్డాయి. ఇక్కడ 20 సీట్లకుగాను కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ 18 స్థానాలు కైవసంచేసుకున్నది. ఈ ఎన్నికల ఫలితాలు రాహుల్‌గాంధీ నాయకత్వంపై ప్రశ్నలు రేకెత్తించాయి. ఒక దశలో ఆయన పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారని, ఆయనను తల్లి సోనియాగాంధీ అనునయించారని వార్తలు వచ్చాయి. ఈ విషయంపై మీడియా సమావేశంలో మాట్లాడేందుకు రాహుల్‌గాంధీ తిరస్కరించారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు శుక్రవారం పార్టీ నాయకత్వం సమావేశం కానున్నదని వెల్లడించారు.
యూపీలో పట్టు నిలబెట్టుకొన్న బీజేపీ
రాజకీయంగా అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీలు మహాకూటమి పేరుతో గట్టిపోటీనిచ్చినా.. అక్కడ బీజేపీ తన ప్రాభవాన్ని కాపాడుకున్నది. గత ఎన్నికల్లో యూపీలో 80 స్థానాలకు గాను 71 సీట్లు గెలిచిన బీజేపీ.. ప్రస్తుతం 62 స్థానాల్లో పట్టు నిలబెట్టుకోగలిగింది. వాస్తవానికి ఎగ్జిట్‌పోల్స్‌లో బీజేపీకి కేవలం 30-40 మధ్య సీట్లు లభిస్తాయని అంచనావేసినా.. మెరుగైన ఫలితాలు రాబట్టింది. ఎస్పీ 8, బీఎస్పీ 11 స్థానాలతో సరిపెట్టుకున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ తీవ్ర పరాభవానికి గురైంది. ఒక్క సోనియాగాంధీ తప్ప ఆ పార్టీ నుంచి ఎవరూ యూపీలో గెలువలేదు. ఆఖరుకు పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఘోరపరాజయం పాలయ్యారు. అయితే.. కేరళలోని వయనాడులో మాత్రం రికార్డుస్థాయి మెజార్టీతో గెలువడంతో పరువు దక్కినట్టయింది. మొత్తంగా 13 రాష్ర్టాల్లో కాంగ్రెస్‌కు ఒక్క స్థానం కూడా లభించలేదు.
జాతీయభద్రతకు జై
గత ఐదేండ్లలో పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలతో సాధారణ ప్రజలు, వ్యాపారస్థులు తీవ్ర ఇబ్బందులకు గురైనా.. తన పరిపాలనాకాలంలో చేపట్టిన కార్యక్రమాలు, ప్రత్యేకించి ఎన్నికల ముందు పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదుల దాడి, దానికి ప్రతీకారంగా భారత సైనిక దళాలు పీవోకేలోని బాలాకోట్‌లోని ఉగ్రశిబిరాలపై నిర్వహించిన మెరుపుదాడులు బీజేపీకి బాగా కలిసివచ్చాయి. ఈ దాడుల నేపథ్యంలో జాతీయభద్రత, జాతీయవాదం, హిందూత్వ కీలక అంశాలుగా మోదీ నిర్వహించిన సుదీర్ఘ ఎన్నికల ప్రచారం ప్రజల్లో ఆయన పట్ల సంపూర్ణ సానుకూలతను తీసుకొచ్చింది. కాంగ్రెస్ వారసత్వ రాజకీయాలపై తరచూ నిప్పులు చెరగటంతోపాటు.. దేశం ఎదుర్కొంటున్న కష్టాలకు, అంతులేని అవినీతికి దశాబ్దాల తరబడి పాలించిన కాంగ్రెస్ పార్టీయే కారణమంటూ మోదీ చేసిన విమర్శలు జనంలోకి వెళ్లాయి. బీజేపీ విభజన రాజకీయాలకు పాల్పడుతున్నదని, జాతీయవాదాన్ని రెచ్చగొడుతున్నదని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శలు గుప్పించినా.. ఫలితాలనివ్వలేకపోయాయి.