భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈరోజు ఇస్రో చేపట్టిన జీఎస్‌ఎల్వీ ఎఫ్ 11 ప్రయోగం విజయవంతమైంది. జీఎస్‌ఎల్వీ ఎఫ్ 11 వాహక నౌక.. జీశాట్ 7ఏ ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లి భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో ఛైర్మన్ శివన్ ప్రకటించారు. ప్రయోగం విజయవంతంపై ఇస్రో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేస్తూ పరస్పరం అభినందనలు తెలుపుకొన్నారు.
జీశాట్ 7ఏ ఉపగ్రహం బరువు 2,250 కిలోలు. 8 ఏళ్లపాటు ఈ ఉపగ్రహం సేవలందించనుంది. జీశాట్ 7ఏ.. భారత్ పంపిస్తున్న 35వ సమాచార ఉపగ్రహం. దేశీయ కమ్యూనికేషన్ ఉపగ్రహంగా దీన్ని రూపొందించారు. క్రయోజనిక్ ఇంజన్ కలిగిన నాలుగోతరం వాహకనౌక జీఎస్‌ఎల్వీ ఎఫ్11. జీశాట్ 7ఏ ఉపగ్రహాన్ని సైనిక సమాచార ఉపగ్రహంగా ఇస్రో పరిగణిస్తోంది. భారత వాయుసేనకు 70శాతం, సైన్యాకు 30 శాతం ఇది ఉపకరించనుంది. జీశాట్ 7ఏ ప్రయోగంతో వైమానికదళ కమాండ్ సెంటర్లకు కొత్త జవసత్వాలు రానున్నాయి. కేయూ బ్యాండ్ ద్వారా రాడార్ల కంటే శక్తిమంతమైన సిగ్నళ్లను ఇది అందించనుంది. ఈ సిగ్నళ్లు ప్రధానంగా విమానాలకు ఉపకరించనున్నాయి. దీంతో గగనతలంలో రెండు విమానాల మధ్య సమాచార మార్పిడి సులభతరం కానుంది.