శుక్రవారం రాష్ట్ర ఓటర్ల జాబితా విడుదలకు సర్వంసిద్ధo
రాష్ట్ర ఓటర్ల జాబితా విడుదలకు సర్వంసిద్ధమైంది. ఓటర్ల జాబితాను విడుదల చేసేందుకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ప్రస్తుతానికి ఉన్న అడ్డంకులు తొలిగిపోయాయి. శుక్రవారం (ఈ నెల 12న) ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ తెలిపారు. బుధవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఓటర్ల నమోదు, అభ్యంతరాలు, సవరణలపై సెప్టెంబర్ 10 నుంచి 25వ తేదీ వరకు చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌కు అనూహ్య స్పందన లభించిందని చెప్పారు.
డ్రైవ్‌లో 33,14,006 మంది దరఖాస్తు చేసుకోగా, వాటిని పరిశీలించి వివిధ కారణాలతో మూడు లక్షలకుపైగా దరఖాస్తులను తిరస్కరించామని తెలిపారు. మిగతా 30,00,872 దరఖాస్తులను సరైనవిగా గుర్తించామని పేర్కొన్నారు. గతంలో ఉన్న డ్రాఫ్ట్‌రోల్‌లో 2.61 కోట్ల మంది ఓటర్లు ఉండగా తాజాగా మరో 30 లక్షల మంది ఓటర్లు నమోదయ్యారని, కొత్త ఓటరు జాబితాలో 2.91 కోట్ల మంది ఓటర్లుగా నమోదవుతారని చెప్పారు.
ఓటరు జాబితాలో కొత్తగా చేరినవారి పేర్లను ఈఆర్వో నెట్ అనే సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేస్తున్నామని రజత్‌కుమార్ చెప్పారు. ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగిస్తామని వెల్లడించారు. అభ్యర్థుల నామినేషన్ల తుది గడువుకు 10 రోజుల ముందువరకు ఓటరుగా నమోదుచేసుకున్న వారిని ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసేందుకు అనుమతిస్తామని తెలిపారు. వీరికి ప్రత్యేక జాబితాలో చోటు కల్పిస్తామని పేర్కొన్నారు. జాబితా విడుదలయ్యాక ఓటర్ల ఐడీ (ఇపిక్) కార్డులు ముద్రిస్తామని, కొత్తవారికీ కార్డులు ఇస్తామని వెల్లడించారు.