అమిత్ షా బుధవారం నాడు హైదరాబాద్ రానున్నారు
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బుధవారం నాడు హైదరాబాద్ రానున్నారు. ఉదయం 11 గంటలకు ఆయన బేగంపేట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో వస్తారు. అక్కడి నుండి ఆయన బంజారాహిల్స్‌లోని కళింగ భవన్ వద్ద ఉన్న అగ్రసేన్ మహరాజ్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పిస్తారు. అనంతరం కాచిగూడలోని శ్యామ్‌బాబా ఆలయాన్ని సందర్శిస్తారు. అక్కడే సాధు సంత్‌లతో ఆయన సమావేశం అవుతారు. అనంతరం అక్కడి నుండి నేరుగా 12 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగే పోలింగ్ బూత్ కార్యకర్తలతో సమావేశం అవుతారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గాలకు చెందిన బూత్ కమిటీ అధ్యక్షులు, కార్యదర్శులు ఆపై స్థాయి నాయకులకు పార్టీ లక్ష్యాలను వివరిస్తారు.
ఒంటి గంటకు తిరిగి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుని భోజనం చేస్తారు. అనంతరం స్వల్ప విరామం తీసుకున్న తర్వాత రెండు గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుండి ప్రత్యేక హెలికాప్టర్‌లో కరీంనగర్‌లో జరిగే ఎన్నికల సమరభేరి సభలో పాల్గొంటారు. బంజారాహిల్స్‌లో జరిగే అగ్రసేన్ పూలమాల కార్యక్రమంలో అమిత్ షాతో పాటు పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి పి మురళీధరరావు, కేంద్ర ఆరోగ్యమంత్రి జగత్ ప్రకాష్ నడ్డా, బండారు దత్తాత్రేయ, తెలంగాణ ఇన్‌ఛార్జి పి కృష్ణదాస్, జి కిషన్‌రెడ్డి, ఎన్ రామచందర్‌రావు, పేరాల శేఖర్ రావు తదితరులు పాల్గొంటారు.