ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగారా
కీలకమైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రకటించారు. త్వరలోనే అసెంబ్లీ పదవీకాలం ముగియనున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరం, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం, తెలంగాణలో ఇవాల్టి నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి తక్షణమే అమల్లోకి వస్తుందని చెప్పారు. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ 15లోగా పూర్తవుతాయని ఓపీ రావత్ ప్రకటించారు. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొత్తం జనవరి 15కు ముందే పూర్తవుతాయని చెప్పారు.
ఈ ఏడాది డిసెంబర్ 7న తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ఓపీ రావత్ స్పష్టం చేశారు. 119 నియోజకవర్గాలకు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 11న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. నవంబర్ 12న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల చివరి తేదీ నవంబర్ 19. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 22.
ఛత్తీస్‌గఢ్ : రెండు విడతల పోలింగ్ నిర్వహణ. తొలి విడత పోలింగ్ – నవంబర్ 12, రెండో విడత పోలింగ్- నవంబర్ 20.
మధ్యప్రదేశ్, మిజోరం : ఒకే విడత పోలింగ్. రెండు రాష్ట్రాల్లో నవంబర్ 28న పోలింగ్.
రాజస్థాన్, తెలంగాణ : ఒకే విడత పోలింగ్, డిసెంబర్ 7న పోలింగ్.
ఎన్నికల ఫలితాలు: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 11న ప్రకటిస్తారు.