భారత దేశ సర్వోన్నత న్యాయస్థానం 46వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రంజన్ గొగోయ్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. సుప్రీంకోర్టు సీజేగా జస్టిస్ రంజన్ గొగోయ్ చేత భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్ దీపక్ మిశ్రా నుంచి గొగోయ్ బాధ్యతలు స్వీకరించారు. సీనియర్ న్యాయవాది అయిన గొగోయ్ 13నెలల పాటు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించనున్నారు. ఈశాన్యం నుంచి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన తొలి సీజేఐగా గగోయ్ చరిత్ర సృష్టించారు. రాష్ట్రపతిభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్రమోదీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ తదితరులు పాల్గొన్నారు.
భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ రంజన్ గొగోయ్… అసోం నుంచి ఈ అరుదైన ఘనతను దక్కించుకున్న తొలి న్యాయమూర్తిగా రికార్డు నెలకొల్పారు. 1954 నవంబర్ 18న అసోంలోని దిబ్రూగఢ్ జిల్లాలో గొగోయ్ జన్మించారు. 1978లో బార్ అసోసియేషన్‌లో చేరి గౌహతి హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. 2001 ఫిబ్రవరి 28న హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2010 సెప్టెంబర్ 9న పంజాబ్, హర్యానా హైకోర్టుకు బదిలీ అయిన ఆయన… 2011 ఫిబ్రవరి 12న ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2012 ఏప్రిల్ 23న ఆయనకు సుప్రీం న్యాయమూర్తిగా పదోన్నతి లభించింది. ఈ నెల 2న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా పదవీకాలం ముగియడంతో.. ఆయన స్థానంలో సుప్రీంకోర్టు సీజేగా గొగోయ్ నియమితులయ్యారు. గొగోయ్ తండ్రి కేశవ్ చంద్ర గొగోయ్ 1982లో అసోం ముఖ్యమంత్రిగా పనిచేశారు.