డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి(94) మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. తీవ్ర జ్వరం, మూత్ర పిండాల సమస్య కారణంగా పది రోజుల క్రితం చెన్నైలోని కావేరి దవాఖానలో కరుణానిధి చేరిన సంగతి తెలిసిందే. పరిస్థితి విషమించడంతో నేడు ఆయన మృతిచెందారు. ఈ మేరకు ఆస్పత్రి వర్గాలు అధికారిక ప్రకటనను విడుదల చేశాయి.
కరుణ మృతి వార్త తెలుసుకున్న ఆయన అభిమానులు, డీఎంకే శ్రేణులు ఆసుపత్రి వద్దకు భారీగా తరలివస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నగరంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గోపాలపురంలోని కరుణానిధి నివాసానికి ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు చేరుకున్నారు. ముత్తువేల్ కరుణానిధి అసలు పేరు దక్షిణామూర్తి. కరుణానిధికి ముగ్గురు భార్యలు పద్మావతి, దయాళు అమ్మాళ్, రాజత్తి అమ్మాళ్. వైద్య లాంఛనాలు పూర్తి చేసిన అనంతరం కరుణానిధి భౌతికకాయాన్ని గోపాలపురంలోని ఆయన నివాసానికి తరలించనున్నారు. అక్కడ కొన్ని క్రతువులు పూర్తి చేసిన తర్వాత ప్రజల సందర్శనార్థం చెన్నైలోని రాజాజీ హాలుకు తరలించే అవకాశముంది.
1969లో సీఎన్ అన్నాదురై మరణించినప్పటి నుంచి నేటి వరకు ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కరుణానిధి డీఎంకే పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. తమిళనాడు రాష్ర్టానికి మూడో ముఖ్యమంత్రిగా 1969లో పదవి చేపట్టి- 1971 వరకు, 1971-1974, 1989-1991, 1996-2001, 2006-2011 ఐదు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 60 సంవత్సరాల రాజకీయ జీవితంలో పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లో 13 సార్లు గెలిచి గిన్నీస్ బుక్ రికార్డుకెక్కారు. 2004 ఎన్నికల్లో తమిళనాడులోని 40 లోక్‌సభ స్థానాలకు గాను నలబై గెలిచి యూపీఏ ప్రభుత్వం నెలకొల్పడంలో ప్రధాన పాత్ర పోషించారు. తాను స్వయంగా నాస్తికుడిగా ప్రకటించుకున్నారు. ఈ.వి రామస్వామి నాయకర్ సిద్ధాంతాలను అనుసరించారు.
ఉద్యమాలు, సాహిత్యమంటే ఆసక్తి
కేవలం ఎనిమిదో తరగతి వరకే
చదువుకున్న కరుణానిధికి ఉద్యమాలన్నా, సాహిత్యమన్నా ఎంతో ఆసక్తి
చూపించేవారు. మూడ విశ్వాసాల నుంచి ప్రజలను చైతన్యం చేసేందుకు ఎన్నో నాటికలు రాసి ప్రదర్శించేవారు. జస్టిస్ పార్టీ నాయకుడు అలగిరిస్వామి ప్రసంగాలకు
ఉత్తేజితుడై 14 ఏండ్ల వయస్సు నుంచే హిందీ వ్యతిరేకోధ్యమంలో పాల్గొని అనేక
సార్లు జైలుకు వెళ్లారు. ద్రవిడ ఉద్యమం, హిందీ వ్యతిరేకోద్యమాల్లో
కరుణానిధి తనదైన ముద్ర వేశారు. కరుణ తమిళ సాహిత్యంలో తనదైన ప్రతిభను
కనబర్చారు. పద్యాలు, నాటికలు, లేఖలు, నవలలు, జీవిత చరిత్రలు, సినిమాలు,
సంభాషణలు, పాటలు మొదలైన అన్ని రంగాల్లో ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. 1970 సంవత్సరంలో పారిస్‌లో మూడో ప్రపంచ తమిళ మహాసభ నిర్వహించారు. 1987
సంవత్సరంలో ఆరో ప్రపంచ తమిళ మహాసభ కౌలాంలంపూర్(మలేషియా)లో నిర్వహించారు.
2010లో నిర్వహించిన ప్రపంచ తమిళ మహాసభలో సెమ్మోజియానా తమిజు మోజియం అను
తమిళ కాన్ఫరెన్స్ అధికారిక పాట రాశారు. ఈ పాటకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహెమాన్ సంగీతం అందించారు.