ఖరీదైన ఆభరణాలు కొనుగోలుకు సంబంధించి నీరవ్‌మోడీ కస్టమర్లపై ఐటీ కన్ను
పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.వేల కోట్లకు మోసగించి విదేశాలకు పారిపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ కేసుకు సంబంధించి అధికారులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఆయన వద్ద ఖరీదైన నగలు కొనుగోలు చేసిన సంపన్నులపై ఆదాయపన్ను శాఖ అధికారుల దృష్టి పడింది. నీరవ్‌మోదీకి చెందిన దుకాణాల నుంచి అత్యంత ఖరీదైన ఆభరణాలు కొనుగోలు చేసిన దాదాపు 50 మంది సంపన్నులపై దర్యాప్తు చేస్తామని, వారి పన్ను రిటర్నులను తిరిగి పరిశీలించాలని నిర్ణయించామని అధికారులు స్పష్టంచేశారు. అంతటి ఖరీదైన ఆభరణాలు కొనుగోలుకు సంబంధించి , రిటర్నుల వివరాలు తెలియజేయాలని అధికారులు వారికి నోటీసులు పంపనున్నారు. నీరవ్ దుకాణాల నుంచి పలు పత్రాలను సేకరించామని, వాటి ప్రకారం ఖరీదైన వజ్రాల నగలు కొనుగోలు చేసిన వారు డబ్బును కొంత డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా, మరికొంత చెక్ ద్వారా, మిగతాది నగదు రూపంలో చెల్లించారని అధికారులు వెల్లడించారు. అయితే ట్యాక్స్ నోటీసుల్లో చాలా మంది తాము ఎలాంటి నగదు చెల్లింపులు చేయలేదని చెప్పినట్లు అధికారులు అంటున్నారు. దీంతో ఈ విషయంపై దర్యాప్తు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.