కనీసం 33 శాతం గ్రీన్‌కవర్ ఉండాలి
సంపద సృష్టించడంతోపాటు భావితరాలకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలంటే మంచి వాతావరణం చాలాముఖ్యం. కాలుష్య వాతావరణంలో మనిషి మనుగడ సాధ్యం కాదు. కాబట్టి పర్యావరణ సమతుల్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వడం శాస్త్రీయదృక్పథం కలిగిన మనుషులు చేసేపని. ఇప్పుడు అడవుల శాతం తక్కువ ఉంది. ఇది పెరుగకుంటే మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. కాబట్టి మిషన్‌మోడ్‌లో పనిచేసి తెలంగాణలో అడవులశాతం పెంచాలి. తెలంగాణలోని మొత్తం భూభాగంలో 24 శాతం అటవీ భూములున్నాయి. కానీ అడవులు మాత్రం 12 శాతంలోపు మాత్రమే ఉన్నాయి. కనీసం 33 శాతం గ్రీన్‌కవర్ ఉండేలా చెట్ల పెంపకం జరగాలని సీఎం కేసీఆర్ నొక్కిచెప్పారు.
వచ్చే సంవత్సరం నుంచి ఏడాదికి వందకోట్ల మొక్కలు నాటి, వాటిని పరిరక్షించే విధంగా తెలంగాణకు హరితహారం కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఇంతపెద్ద మొత్తంలో మొక్కలు సిద్ధం చేయడానికి వీలుగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో నర్సరీల సంఖ్య పెంచాలని సూచించారు. అడవుల పునరుద్ధరణ, సామాజిక అడవుల పెంపకంతోపాటు పండ్లచెట్ల పెంపకానికి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతిభవన్‌లో శనివారం సమీక్ష నిర్వహించారు. మండలి చైర్మన్ స్వామిగౌడ్, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు కేటీ రామారావు, జూపల్లి కృష్ణారావు, జోగురామన్న, ఎంపీలు జే సంతోష్‌కుమార్, బాల్క సుమన్, బూర నర్సయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో వివిధ కార్పొరేషన్ల మేయర్లు, కమిషనర్లతో మాట్లాడి, ఆయా నగరాల్లో గ్రీన్ కవర్ పెంచడానికి తీసుకుంటున్న చర్యలపై సీఎం కేసీఆర్ చర్చించారు. హైదరాబాద్‌తోపాటు అన్ని నగరాలు, పట్టణాల్లో చెరువుల పరిరక్షణపై శ్రద్ధ వహించాలి. మురికి కాల్వలు చెరువుల్లో కలువకుండా మళ్లింపు కాల్వలు నిర్మించాలి. సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి. చెరువులను శుభ్రంగా, చెరువుల చుట్టూ పచ్చగా ఉండే విధంగా క్లీన్ అండ్ గ్రీన్ నిర్వహించాలి అని సీఎం కేసీఆర్ నొక్కిచెప్పారు. ఈ సందర్భంగా సీఎం సూచనలు, ఆదేశాలు ఆయన మాటల్లోనే..