జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆరవ జోన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
కోటి జనాభాకు పౌరసేవలను నిర్వహణ, అవసరాలకు తగిన విధంగా అభివృద్ధి చేపట్టే జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆరవ జోన్ ఏర్పాటు కానుంది. ప్రస్తుతమున్న ఈస్ట్,వెస్ట్,నార్త్,సౌత్, సెంట్రల్ జోన్లుగా ఐదు జోన్లలో స్వల్పంగా మార్పులు, చేర్పులు చేస్తూ, ఒక్కో జోన్‌లో ఐదు నుంచి ఆరు సర్కిళ్ల వరకు ప్రాంతాలొచ్చేలా ఏర్పాటు చేశారు. దీనికి తోడు తాజాగా పరిపాలన సౌలభ్యం కోసం ఇప్పటికే ప్రతిపాదన స్థాయిలో ఉన్న ఆరవ జోన్‌కు గురువారం మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన జరిగిన ‘స్థారుూ సంఘం’ సమావేశం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతమున్న ఐదు జోన్లలో ఒక్కో జోన్లలో ఎక్కువ ప్రాంతాలు, సర్కిళ్లు, మున్సిపల్ డివిజన్లు ఉండటంతో పౌరసేవల నిర్వాహణ, పరిపాలన అంశాలపై అధికారులు తగిన స్థాయిలో దృష్టి సారించలేకపోతుండటంతో ఈ ఆరవ జోన్‌ను అధికారులు కొద్ది రోజుల క్రితం తెరపైకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే! ఇపుడు స్థారుూ సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ఇక ఆరవ జోన్ అమల్లోకి వచ్చేందుకు ఎక్కువ సమయమేమీ పట్టేట్టు లేదు.
ఆమోదం పొందిన ప్రతిపాదనలు.
* కామినేని ఆసుపత్రి నుంచి మన్సూరాబాద్ వనస్థలిపురం, సుష్మాజంక్షన్ వరకు వంద అడుగుల రోడ్డువిస్తరణ కోసం 240 ఆస్తుల నుంచి స్థల సేకరణకు ఆమోదం.
* జీహెచ్‌ఎంసీకి పెట్టుబడులను సమకూర్చేందుకు సలహాదారుగా ‘స్పా’ క్యాపిటల్‌ను ఏజెన్సీగా నియమించాలన్న ప్రతిపాదనకు సానుకూల తీర్మాన.
* బేగంపేట బ్రిడ్జి నుంచి నెక్లెస్‌రోడ్డు రైల్వే బ్రిడ్జి వరకు 80 ఫీట్ల రోడ్డు విస్తరణకు 25 ఆస్తుల నుంచి స్థలాన్ని సేకరించేందుకు గ్రీన్ సిగ్నల్.
* ఎం.జే.మార్కెట్ పునరుద్ధరణ కోసం రూ. 4.90 కోట్ల అంచనా ప్రతిపాదనకు, గ్రానైట్ రాయిని పరవాలన్న రూ.3 కోట్ల ప్రతిపాదనలకు ఆమోదం
* దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, జీహెచ్‌ఎంసీల మధ్య మెరుగైన పౌరసేవల నిర్వాహణ అంశాలపై అధ్యయనం, తదితర అంశాలపై ఆర్థిక భారం లేకుండా కలిసి పనిచేయాలన్న ఎంఓయూ ఒప్పందం చేసుకునేందుకు అనుకూలంగా నిర్ణయం.
* విజిలెన్స్, విపత్తుల నివారణ విభాగంలో విధి నిర్వహణ కోసం వచ్చే సబ్ ఇన్‌స్పెక్టర్లకు ఒక్కో అద్దె వాహనానికి రూ.34వేలు చొప్పును నెలసరి చెల్లించేందుకు, అసిస్టెంటు ఎస్‌ఐలకు నెలకు రూ. 20వేలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లకు నెలకు రూ.5వేలను చెల్లించేందుకు ఆమోదం.
* ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ డైరెక్టర్‌గా నియమితులైన విశ్వజిత్ కంపటి బాధ్యతలు, విధులను కేటాయిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులకు స్థారుూ సంఘం ఆమోద ముద్ర.
* రహీంపురా ప్లేగ్రౌండ్, ఖాళీ స్థలాన్ని రోజుకి రూ.3700కు అద్దె ప్రాతిపదికన గణేష్ విగ్రహాల తయారీకిచ్చేందుకు సుందర్ ఫైన్ ఆర్ట్స్‌కు 120 రోజుల పాటు కేటాయించాలని నిర్ణయం, అంతేగాక, ఎకోఫ్రెండ్లీ విగ్రహాలను కూడా తయారు చేయాలని నిబంధనను కూడా విధించింది.
* జమిస్తాన్‌పుర్ అడిక్‌మెట్‌లో జీహెచ్‌ఎంసీ స్వాధీనం చేసుకున్న 500 గజాల రెవెన్యూ భూమిని ఎక్సైజ్ పోలీస స్టేషన్ నిర్మాణానికి అప్పగించాలన్న ప్రతిపాదనను జిల్లా కలెక్టర్‌కు పంపేందుకు ఆమోదం.