దేశ రాజకీయాలు, పరిపాలనలో గుణాత్మక మార్పుకు ప్రయత్నం
దేశానికి కొత్త దిశ చూపేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్‌రావు మంచి ప్రయత్నం చేస్తున్నారని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తర్ ప్రదేశ్ మాజీ సిఎం అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఇందుకు అన్ని ప్రాంతీ య పార్టీలను కూడగట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలకు సమాజ్‌వాదీ పార్టీ సంపూర్ణ మద్దతునిస్తుందని ఆయన ప్రకటించారు. ఎవరినో ప్రధానిని చేయడం తమ లక్షం కాదని, దేశ రాజకీయాలు, పరిపాలనలో గుణాత్మక మార్పు తీసుకువచ్చే లక్షశుద్ధితో పని చేస్తున్నామని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు.
త్వరలో ఢిల్లీకి వెళ్తానని, అక్కడ మరికొందరు మిత్రు లు, పార్టీలను కలుస్తానని వెల్లడించారు. దేశ రాజకీయాల్లో మార్పు కోసం సిఎం కెసిఆర్ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా అఖిలేశ్ బుధవారం హైదరాబాద్ వచ్చారు. లక్నో నుండి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు చేరుకున్న ఆయనకు బేగంపేట విమానాశ్రయంలో మంత్రులు కె.టి.రామారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు ఘనస్వాగతం పలికారు. ఆయనతో పాటు హైదరాబాద్‌కు వచ్చిన వారిలో సమాజ్‌వాదీ పార్టీ రాజ్యసభ సభ్యులు సంజయ్ సేథ్ ఉన్నారు. అనంతరం ప్రగతిభవన్‌కు చేరుకున్న అఖిలేశ్‌కు సిఎం కెసిఆర్ ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. విందులో వారిరువురితో పాటు టిఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు డాక్టర్ కె.కేశవరావు, లోక్‌సభాపక్ష ఉప నాయకులు బి.వినోద్‌కుమార్, మంత్రులు కెటిఆర్, తలసాని, ఎంపిలు బడుగుల లింగయ్య యాద వ్, మల్లారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, టిఆర్‌ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు తుల ఉమ, టిఆర్‌ఎస్ యువజన విభాగం అధ్యక్షులు, ఎంఎల్‌సి శంబీపూర్ రాజు తదితరులు పాల్గొన్నారు.
తరువాత సిఎం కెసిఆర్, అఖిలేశ్ యాదవ్‌లు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాను ప్రతిపాదిస్తున్న ప్రత్యామ్నాయం గురించి కెసిఆర్ సుదీర్ఘంగా అఖిలేష్‌కు వివరించారు. సుమారు రెండు గంటల పాటు వారిరువురు వివిధ అం శాలు, దేశ రాజకీయాలపై చర్చించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారిరువురు తమ భేటీ వివరాలను వెల్లడించారు. తాను ప్రతిపాదిస్తున్నది రాజకీయ వేదికనో,థర్డ్ ఫ్రంటో, ఫోర్త్ ఫ్రంటో, ఫిఫ్త్ ఫ్రంటో కాదని సిఎం కెసిఆర్ స్పష్టం చేశా రు. డ్బ్బై ఏళ్లుగా దేశాన్ని పాలించిన ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమయ్యాయన్నారు.