*బీసీ కులగణనతో సమన్యాయం -జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి*
*కుల గణన ప్రధాన లక్ష్యంగా- బీసీ సంఘాల పోరాటం*
*అసమానతలను తొలగించడానికి పేదరికం నిర్మూలించడానికి కులగణన బ్రహ్మాస్త్రం*
జన గణనలో కుల గణన లెక్కలు తీస్తేనే ఆయా వర్గాల వారికి సమన్యాయం జరుగుతుందని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు దుండ్ర కుమారస్వామి అన్నారు. దేశవ్యాప్తంగా కుల గణన చేబడితే సామాజిక, ఆర్థిక, విద్య ,ఉద్యోగ రాజకీయ రంగాలలో వివరాలన్నీ సంపూర్ణంగా లభ్యమవుతాయని అన్నారు. అప్పుడె అన్ని కులాల యొక్క వాస్తవ స్థితిగతులు లభ్యం అవుతాయి ,తద్వారా సామాజిక కులాల పరిస్థితులను గమనంలోకి తీసుకొని ప్రణాళికలు, సంక్షేమ పథకాలను అమలు చేయవచ్చని అన్నారు. కుల గణన ద్వారా అసమానతలను తొలగించి పేదరిక నిర్మూలించడానికి దోహదం చేస్తుందన్నారు. గురువారం నాడు కాచిగూడ లో బీసీ ప్రతినిధుల సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ బీహార్ లో కులగణన చేపట్టిన నితీష్ కుమార్ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన చేపడతామని ప్రకటించిన విధంగా బీహార్ తరహాలో తెలంగాణలో కులగణన వెంటనే చేపట్టాలని జాతీయ బీసీ దళ్ అధ్యక్షులు కుమారస్వామి కోరారు.