ప్రపంచ మానవాళికి పోరాట స్ఫూర్తి ప్రదాత నెల్సన్ మండేలా * నల్లజాతి సూర్యుడు మండేలా పరిచయం నేటి తరానికి మరీ అవసరం* హక్కులకై కలబడు బాధ్యతలకు నిలబడు అనే సారాంశం మండేలా జీవితంలో అడుగడుగునా దర్శనమిస్తుంది
ప్రపంచంలో ఏ మూలన అసమానతలు దోపిడీ వివక్షత అంతరాలు అణచివేత ఆధిపత్య ధోరణులు ఉంటాయో వాటిని అధిగమించి స్వేచ్ఛ స్వాతంత్రాలు సమబావము కలిగిన సమసమాజ స్థాపన కోసం ఉద్యమాలు కూడా కొనసాగడం అంతే సహజమని నేటితరం మరీ గుర్తించాలి. ఏ సమాజంలోనైనా బాధ్యత మరిచిన పౌర సమాజం ప్రజా సంఘాలు వ్యక్తులు ఉంటారో అక్కడ నియంతృత్వం రాజ్యమేలుతుంది . రాజ్యం అక్రమార్కుల బొజ్జ్యమవుతుంది. అందుకే" ప్రజలు జాగరూకులై ఉన్నప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది" అని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చేసిన హెచ్చరిక కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా వర్తిస్తుంది అనడంలో సందేహం లేదు . దక్షిణాఫ్రికాలో ముఖ్యంగా వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేసి దశాబ్దాల పాటు కారాగారవాసం అనుభవించి కూడా నిబద్ధత నిజాయితీ జీవితం గడిపిన కారణంగా అనంతర కాలంలో ఆ దేశానికి అధ్యక్షునిగా పనిచేసి ఆదర్శ పాలన కొనసాగించిన మండేలా జీవితం అందరికీ ఆదర్శప్రాయం కావాలి . ఆ అనుభవాలను పునికి పుచ్చుకోవడానికి అందుకోవడానికి ఆరాటపడితేనే తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించినట్లు ప్రజలు గుర్తించాలి. స్థల, కాలాలకు అతీతంగా ఈ పౌర లక్షణం మెరుగైన సమాజ నిర్మాణానికి దోహదపడుతుంది కనుక.
మండేలా జీవితంలోకి తొంగి చూస్తే:-
జాతి వివక్షతకు వ్యతిరేకంగా ఆదేశంలో జరిపిన సాయుధ పోరాటంలో మారణకాండ సందర్భంగా దో షిగా ముద్రపడి 27 సంవత్సరాల పాటు రోబెన్ అనే దీపం లో జైలు శిక్ష అనుభవించిన నెల్సన్ మండేలా ప్రపంచ నాయకులలో ఒకరుగా పేరుగాంచడానికి ప్రధాన కారణం వివక్షత ,ఆదిపత్యం, సామ్రాజ్యవాధాన్ని అడ్డుకోవడం… తద్వారా వర్ణ సమానత్వాన్ని, స్వేచ్ఛ స్వాతంత్రాలను సాధించి ఆ భావాలకు సంకేతంగా నిలవడం నల్ల సూర్యుడి గొప్ప లక్షణం. మహాత్మా గాంధీ స్ఫూర్తితో ఆయన బోధించిన ఆశయాలు శాంతియుత జీవన విధానం అ హింస పద్ధతులు తనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయని స్వయంగా మండేలా అనేకసార్లు ప్రకటించి ఉన్నారు. .అంతర్జాతీయ స్థాయిలో శాంతి సామరస్యానికి కృషి చేసినందుకు భారత ప్రభుత్వం కూడా జవహర్లాల్ నెహ్రూ శాంతి బహుమతితో సత్కరించడం ఆయన కీర్తి కి మరింత వన్నెతెచ్చినది. 1964లో జైలు శిక్ష న్యాయస్థానం ప్రకటించగా 27 సంవత్సరాల తర్వాత ఫిబ్రవరి 11 ,1990లో జైలు నుండి ఆనాటి దేశాధ్యక్షుని ఆదేశం మేరకు విడుదలై తన లక్ష సాధన కోసం జాతి అహంకారాన్ని నివారించడానికి అందరి మధ్య సయోధ్య కుదుర్తడానికి తన జీవితమంతా ధారపోసినారు. నమ్మిన సిద్ధాంతం కోసం జైలుకు వెళ్లి శిక్ష అనుభవించినా తన పూర్వపు శత్రువుల నుండి కూడా ప్రశంసలందుకున్నాడు అంటే “నిజం” ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. వందలాది అవార్డులు సత్కారాలతో వివిధ దేశాలు సంస్థలు ఆయనను సత్కరించగా ప్రపంచంలో అత్యంత ఉత్కృష్టమైన పురస్కారం నోబెల్ బహుమతి సాధించడం ఆయన కీర్తి సిగలో కలికి తురాయి .
దక్షిణాఫ్రికా లోని కేప్ ప్రాంతము ఉమటా జిల్లా మవేజో అనే గ్రామంలో 1918 జూలై 18 వ తేదీన జన్మించినాడు. రాచరిక పరిస్థితుల నుండి ప్రజాస్వామ్యంలోకి దక్షిణాఫ్రికా మారిన తర్వాత ఎన్నికైన మొట్టమొదటి దేశాధ్యక్షునిగా నెల్సన్ మండేలా గుర్తింపు పొందారు . అంతకుముందు జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమ కారునిగా ప్రజా చైతన్యంలో క్రియాశీలక భూమిక పోషించిన నెల్సన్ మండేలా ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్కు, దానికి సాయుధ విభాగం అయిన
ఉంకోన్ టో విసిజేవె సంస్థకు అధ్యక్షునిగా పనిచేసి నియంతృత్వ ప్రభుత్వాలను కూలదో యడంలో చివరి వరకు పోరాడిన పోరాట పటిమ అణచివేతకు వ్యతిరేకంగా జరిగే పోరాటకారులకు దిక్సూచిగా పనిచేస్తుంది.
పోరాట అనంతర జీవిత విశేషాలు:-
11, ఫిబ్రవరి 19 90 రోజున జైలు నుండి విడుదలైన తర్వాత ఆయన పోరాట స్ఫూర్తి కి దేశభక్తికి గుర్తింపుగా భారతదేశపు అత్యున్నత పురస్కారమైన "భారతరత్న" బిరుదుతో ఆయనను సత్కరించడం జరిగింది. ప్రపంచ శాంతిని ఆశించి జాతి వివక్షతను వ్యతిరేకించినందుకు మన దేశం నుంచి ఆయనకు ఎంతో గౌరవం లభించింది అని చెప్పడానికి నిదర్శనంగా భారతదేశంలో పలుచోట్ల ఆయన విగ్రహాలు నెలకొల్పబడినట్లుగా తెలుస్తున్నది. కొన్ని చౌరస్తాలకు రోడ్లకు కూడా మండేలా పేరు పెట్టారని ఢిల్లీలో నెల్సన్ మండేలా రోడ్ దీనికి తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తన 77వ ఏటా 1994 సంవత్సరంలో దక్షిణాఫ్రికా అధ్యక్ష పదవిని చేపట్టి లక్ష సాధనలో విజ యుడై నప్పటికి 1999లో జరిగిన సాధారణ ఎన్నికల్లో రెండవసారి పోటీ చేయరాదని నిర్ణయించుకుని
ఆదర్శ రాజకీయాలకు జీవం పోసిన నేతగా నేటి రాజకీయ పరిస్థితులతో పోల్చుకున్నప్పుడు మనకు తేటతెల్లమవుతుంది. 2001 జూలై నెలలో ఆయనకు ప్రోస్టేట్ క్యాన్సర్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ కావడంతో చికిత్స పొందినప్పటికీ స్వచ్ఛంద సేవను మరిచిపోకుండా ఎయిడ్స్ వ్యాధి నివారణకు మండేలా విశేషంగా కృషి చేసినట్టు తెలుస్తున్నది. 2004 జూన్ నెలలో రాజకీయాల నుండి పూర్తిగా విరమణ పొంది కుటుంబ జీవితం సంతృప్తిగా గడపాలని ప్రకటించినప్పటికీ కొన్ని అవాంతరాలు ఎదుర్కొనక తప్పలేదు . అయినప్పటికీ చివరి రక్తపుబొట్టు వరకు కూడా సామాజిక కార్యక్రమాలతో సంబంధాలు కొనసాగిస్తూనే 5 డిసెంబర్ 2013 న మరణించినాడు. పుట్టుక చావు సామాన్యుల నుండి అసమాన్యుల వరకు దాదాపుగా ఒకే రకంగా ఉంటుంది కానీ కానీ మధ్య జీవితమే మన కార్యక్రమాలు, చర్యలు, స్పందనలను బట్టి ఉత్తములను, అధములను, మధ్యములను ఉన్నతులను చేస్తుంది . మన త్యాగం , సమాజం నుండి పొందే స్ఫూర్తి, సామాజిక చింతన మన ఉనికికి కారణమవుతాయని అందరము గుర్తిస్తే ఆధిపత్యాన్ని ధిక్కరించే క్రమములో పోరాడి చరిత్రలో నిలిచిన నెల్సన్ మండేలాకు 105 వ జన్మదినం సందర్భంగా మనము ఘనమైన నివాళి అర్పించినట్లే.
.
( ఈ వ్యాసకర్త :– వడ్డేపల్లి మల్లేశం
సామాజిక రాజకీయ విశ్లేషకులు