బీసీల కులగణన ఇంకెప్పుడు
దేశంలో అణగారిన వర్గాలకు న్యాయం జరగాలంటే కులగణన జరగాల్సిందే
నలభై సంవత్సరాలైనా మండల్ కమిషన్ సిఫార్సులు అమలవకపోవడం బాధాకరం
జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి
కులగణన పై కేంద్ర ప్రభుత్వం తీరును జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి తప్పుబట్టారు. చాలా కాలంగా కుల ఆధారిత జనాభా గణన చేయాలని డిమాండ్ ఉన్నా కేంద్ర ప్రభుత్వం దీన్ని దాటవేస్తూ వస్తోంది. కేంద్రం మౌనం వీడకపోవడంతో పలు రాష్ట్రాలు కుల గణన చేపట్టేందుకు సిద్ధమయ్యాయి.. కేంద్రం తన తీరును ఎప్పుడు మార్చుకుంటుందో తెలియని పరిస్థితి వచ్చిందని దుండ్ర కుమారస్వామి అన్నారు. బీసీల ఓట్లను కొల్లగొట్టాలంటే మండల్ పేరును వాడుకునే నాయకులు మండల్ స్ఫూర్తితో సామాజిక, రాజకీయ సమన్యాయం కోసం పాటుపడుతున్నారా..? అని దుండ్ర కుమారస్వామి ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఐక్యంగా ముందుకు సాగాలన్నారు. నలభై సంవత్సరాలైనా మండల్ కమిషన్ సిఫార్సులు అమలవకపోవడం బాధాకరం. ఎన్నికల్లో రిజర్వేషన్లను అమలు చేయని కారణంగా ఎంతోమంది బీసీలు ప్రజాప్రతినిధులయ్యే అవకాశాన్ని కోల్పోయారు.. బీసీలు ఎప్పుడూ పల్లకీ మోసే పనులే చేయాలా అని అన్నారు జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి. వనరులపై తమకున్న ఆధిపత్యం బయటపడుతుందనే భయంతో అగ్రవర్ణాల నేతలు కులగణనకు ఇన్నేళ్లూ అడ్డుపడుతూ వచ్చారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా అదే తీరున ముందుకు సాగుతోందన్నారు. భారతీయ సామాజిక అల్లికకు కులం పునాదిగా పని చేస్తూ ఉందని, భారతీయ సామాజిక వర్గాలలో వస్తున్న మార్పులకు కుల గణన అవసరమని ఆనాడు బాబా సాహెబ్ అంబేద్కర్ అన్నారు. కానీ ఆయన ఆశయ సాధన కొరకు మనం కొంచెం అయినా ప్రయత్నిస్తూ ఉన్నామా..? అని ప్రశ్నించారు దుండ్ర కుమారస్వామి. కుల ప్రాతిపదికపైన జనాభా లెక్కింపు రాజ్యాంగం రీత్యా అవసరమని దుండ్ర కుమారస్వామి మరోసారి అన్నారు. దేశంలో అణగారిన వర్గాలకు న్యాయం జరగాలంటే కులగణన జరగాల్సిందేనని, కుల గణన జరిగితేనే బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈబీసీలకు మేలు జరుగుతుందన్నారు దుండ్ర కుమారస్వామి. బీసీలకు రాజ్యాంగం కల్పించిన 27.5 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జనగణన జరగకపోతే బీసీలు తీవ్రంగా నష్టపోతారని దుండ్ర కుమారస్వామి చెప్పారు. 90 ఏళ్ల నాటి డేటా ఆధారంగానే కొనసాగుతున్న రిజర్వేషన్ల కారణంగా బీసీ బిడ్డలు ఎంతగానో నష్టపోతూ ఉన్నారు. సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు నష్టపోతున్నాయి.. కులాల లెక్కల తోనే బీసీల అసలు జనాభా తెలుస్తుందని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి అన్నారు.