మహబూబ్ నగర్ : ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించే క్రమంలో పోలీసు శాఖ నిరంతరం పని చేస్తుందని, ఈ నేపథ్యంలో పోలీసు టెక్నికల్ టీమ్ సహకారాన్ని తీసుకోవడం జరుగుతుందని మహబూబ్ నగర్ రూరల్ ఇన్స్పెక్టర్ మహేశ్వర్ అన్నారు. గత వారం జరిగిన డిగ్రీ పరీక్షలను రాయడానికి వచ్చిన విద్యార్థులు ముగ్గురు తమ మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్నారు. స్థానిక బి.కె.రెడ్డి కాలనీ శారదా ఫార్మసీ కాలేజ్ సెంటర్ లోనికి పరీక్ష రాయడానికి వెళ్తూ, విద్యార్థులు తమ మొబైల్ ఫోన్లను వాహనంలో భద్రపరిచారు. ఈ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు మొబైల్ ఫోన్లను దొంగిలించారని సంబంధిత యువకులు మహబూబ్ నగర్ రూరల్ పోలీసులను ఆశ్రయించగా, పోలీసు అధికారులు విచారణ చేపట్టారు.
పోలీస్ టెక్నికల్ టీం ఇచ్చిన సమాచారం మేరకు నిందితులను గుర్తించి, వారు దొంగిలించిన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని ఈరోజు ఉదయం రూరల్ పోలీస్ స్టేషన్ లో విద్యార్థులకు అప్పగించారు. ఈసందర్భంగా విద్యార్థులు పోలీసుకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఆన్లైన్ తరగతులు జరుగుతున్నందున ఎన్నో ఇబ్బందులు పడి మొబైల్ ఫోన్ కొన్నామని, దొంగలను పట్టుకుని తమ విలువైన ఫోన్లను తమకు అందజేసినందుకు విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఎస్.ఐ.లు రమేష్, రవి, సిబ్బంది పాల్గొన్నారు.