ప్రగతి భవన్ : గత మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పురపాలక శాఖ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి కేటీఆర్ కోరారు. ఈమేరకు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ తో పాటు ఇతర ఉన్నతాధికారులతో మాట్లాడారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణలో నెలకొన్న భారీ వర్షాల వలన ఇప్పటికే పలు మున్సిపాలిటీల్లో నెలకొన్న పరిస్థితుల పైన ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఈ సందర్భంగా ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ని ఆదేశించారు.
ఇప్పటికే నిర్మల్ వంటి చోట్ల భారీగా కురిసిన వర్షాల నేపథ్యంలో జరుగుతున్న సహాయక చర్యలు పైన స్థానిక జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలని అన్నారు. దీంతోపాటు హైదరాబాద్ నగరంలో మరో రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో జీహెచ్ఎంసీ యంత్రాంగం సహాయ చర్యల కోసం సిద్ధంగా ఉండాలని సూచించారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పనిచేసే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సైతం అన్ని విధాలుగా అందుబాటులో ఉండాలన్నారు. ఈ వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టెంత వరకు ప్రతి ఒక్క పురపాలక శాఖ అధికారి/ఉద్యోగి విధుల్లో ఉంటూ స్థానికంగా అందుబాటులో ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని పురపాలక శాఖ యంత్రాంగానికి మంత్రి కేటీఆర్ సూచించారు. పాత భవనాలు, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న పౌరులకు సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అవసరమైతే వారందరిని సురక్షిత ప్రాంతాలకు వెంటనే తరలించేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని కేటీఆర్ అధికారులను కోరారు