ప్రగతి భవన్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో ఇవాళ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఏడున్నర గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో పలు అంశాలపైన మంత్రిమండలి చర్చించి నిర్ణయాలు తీసుకున్నది.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఏడు జిల్లాలలో పర్యటించి వచ్చిన ఆరోగ్యశాఖ కార్యదర్శి ఇతర అధికారులు, ఆయా జిల్లాలలో నెలకొన్న కోవిడ్ పరిస్థితి, తీసుకున్న చర్యలు, నివారణకై ఇచ్చిన సూచనలు, తదితర క్షేత్రస్థాయి పరిశీలనలను, కేబినెట్ కు వివరించారు.
మందులు, ఆక్సీజన్ లభ్యత, ఇతర మౌలిక వసతులు సౌకర్యాలపై కేబినెట్ పూర్తిస్థాయిలో చర్చించింది. వ్యాక్సినేషన్, పడకల లభ్యత, ఔషదాల లభ్యత సహా మూడో వేవ్’ కు సంబంధించిన సన్నద్దత గురించి వైద్యారోగ్యశాఖ అధికారులు కేబినెట్ కు సమాచారం అందించారు.
కరోనా నియంత్రణకు సంబంధించి వైద్యారోగ్యశాఖకు ప్రభుత్వం ఇప్పటికే అన్నిరకాల అనుమతులను ఇచ్చిన నేపథ్యంలో మందులను అందుబాటులో ఉంచడం, జ్వర సర్వేతో సహా అన్నిరకాల ముందస్తు చర్యలు తీసుకోవాలని కేబినెట్ ఆదేశించింది.
బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభం కానున్నది.